అమెరికాలో 24గంటల్లో 1303 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో విజృంభిస్తూనే ఉంది. దేశంలో ఇప్పటివరకు కేసులు పదిలక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో అమెరికాలో 1,303 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 56,797 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,38,990 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,10,356కు చేరింది.

న్యూయార్క్‌లో 22,623 మంది, న్యూజెర్సీలో 6,044, మాసాచ్చుసెట్స్‌లో 3,003, ఇల్లినాయిస్‌లో 1,983, కాలిఫోర్నియాలో 1,776, పెన్నిసిల్వానియాలో 1,860, మిచిగాన్‌లో 3,407, ఫ్లోరిడాలో 1,088 మంది కరోనాతో చనిపోయారు. అమెరికా దేశ వ్యాప్తంగా కేసులు, మరణాల్లో మొదటిస్థానం న్యూయార్క్‌దే. ఈ రాష్ట్రంలో 2,93,991 కేసులు, 22,612 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో మూడింట ఒక వంతు అమెరికాలోనే ఉండడం గమనార్హం. దేశంలో ఈ నెల 14న అత్యధికంగా ఒక్కరోజులో 2,405 మంది మృతిచెందారు. అమెరికాలో గతంలో అత్యధికంగా హెచ్‌1ఎన్‌1 వైరస్‌తో 12,469 మంది, 2017-18 ఫ్లూ సీజన్‌లో 80,000 మంది మృతి చెందారు.

మరోవైపు అమెరికాలోని జార్జియా, ఒక్లహామా, అలస్కా, టెక్సాస్‌ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపులతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, దీనిపై అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు ఎక్కువశాతం ‘స్టే ఎట్‌ హోమ్‌’కు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. రోగుల చికిత్సలో డిస్‌ఇన్పెక్టంట్స్‌ ఇంజెక్షన్స్‌, అతినీల లోహిత కిరణాల వినియోగంపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని ట్రంప్‌ నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here