అగ్రరాజ్యంలో 10 లక్షలు దాటిన కేసులు.. ఇండియాాలోనే ఉంటామంటున్న అమెరికన్లు!

భారత్‌లో ఉన్న చాలా మంది అమెరికన్లు స్వదేశానికి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. ఆమెరికా కంటే తమకు భారత్‌లోనే సురక్షితమని వారు భావించడం విశేషం. గతంలో స్వదేశానికి వెళ్లేందుకు అంగీకరించిన వారు కూడా తాము ఇండియాలోనే ఉంటామని చెబుతున్నారని అధికారులు పేర్కొన్నారు. స్వదేశానికి వచ్చేందుకు సైన్ అప్ చేసిన చాలా మంది అమెరికన్లు ఇప్పుడు కోవిడ్ -19 మహమ్మారి తీవ్రంగా ఉండటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ ఇయాన్ బ్రౌన్‌లీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అమెరికాకు వస్తామని చెప్పిన చాలా మంది.. విమానాలను పంపితే రావడానికి ఆసక్తి చూపడంలేదని అన్నారు.

‘రెండు వారాల కిందట స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమని తెలిపినవారి జాబితాను రూపొందించాం.. ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని వీరంతా కోరారు.. అయితే, ప్రస్తుతం వీరిని సంప్రదించగా విముఖత చూపుతున్నారు. అనేకసార్లు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదు.. ఎందుకంటే వీళ్లు భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉన్న 4,000 మంది అమెరికన్లను స్వదేశానికి తీసుకొచ్చామని.. మరో 6వేల మంది ఎదురుచూస్తున్నారని గతవారం ఇయాన్ వెల్లడించారు.

అమెరికా కేసుల సంఖ్య 10 లక్షలు దాటగా.. దాదాపు 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడితో పోల్చితే భారత్‌లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. దీంతో తాము భారత్‌లోనే సురక్షితంగా ఉంటామని వీరు భావిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 25 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇండియాలోని దాదాపు 50 వేల మందికిపైగా అమెరికా జాతీయులను తమ దేశానికి తరలిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ప్రకటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు ప్రక్రియ చేపట్టారు. వీరిలో ఎక్కువ శాతం అమెరికన్లు స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here