మరో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్.. ఇప్పటికే నలుగురు..

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. సామాన్యుల‌ నుంచి వీఐపీల‌ వరకు ఎవ్వరినీ వ‌ద‌ల‌డం లేదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే ప‌లువురు వైసీపీ శాసనసభ్యులు క‌రోనా బారిన పడగా.. తాజాగా, మరో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా తేలింది. కర్నూలు జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణిరెడ్డికి క‌రోనా ప‌రీక్షలు నిర్వహించ‌గా.. పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తనను పరామర్శించడానికి ఎవరూ రావొద్దని చక్రపాణిరెడ్డి కోరారు.

కాగా, ఏపీలో ఇప్పటి వరకు నలుగురు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సహా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఇటీవలే కరోనా బారినపడ్డ కడప ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కోలుకున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరోనా బారినపడ్డారు.

ఇక, ఏపీలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్రంలో తొలిసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,245 శాంపిల్స్ పరీక్షించగా మరో 2,592 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 8 మందికి.. విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసులు 2,602కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 40,646కు చేరింది. గడచిన 24 గంటల్లో 42మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 534కి చేరింది. గత 24 గంటల్లో 943మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 20,298 నమోదయ్యింది. మరో 19,814మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here