అవినీతి కేసుల్లో విచారణ జరిగేదెప్పుడు..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు విచారణ ఎదుర్కోలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో విచారణ జరిగి దోషులకు శిక్షలు పడకుండా స్టే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరుతో చేసిన పనులన్నీ ఇప్పుడు వివాదంలోకి వచ్చేసాయి. ఈ.ఎస్.ఐ కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసుల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి పితాని సత్యన్నారాయణ కుమారుడు సురేష్ పై ఆరోపణలు రావడంతో ఎసిబి ఆయన్ను పట్టుకునే పనిలో ఉంది. ఈయన మాత్రం ఎసిబికి చిక్కకుండా స్టేలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. గతంలో ఈయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో 10 మంది మృతిచెందిన ఘటన దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో రమేష్ హాస్పిటల్స్ యజమాని డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేసి విచారించాలని పోలీసులు గాలింపు చేపట్టారు. కోవిడ్ కేర్ సెంటర్లో ప్రమాదం జరిగిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే డాక్టర్ రమేష్ మాత్రం పోలీసులకు చిక్కకుండా కోర్టులో స్టే పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం కేసు విచారణను ఆపాలని చెప్పింది. పది మంది అమాయకుల మృతి ఘటనలో  విచారణను ఎదుర్కోవాల్సి డాక్టర్ రమేష్ ఇందుకు దూరంగా ఎందుకు ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోర్టులు, స్టేలు కొత్తేమి కాదు. ఆయన పరిపాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు సిద్ధమైన తరుణంలో స్టే తెచ్చుకున్నారు. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణ జరగకుండా చేస్తున్నారు. ఈ.ఎస్.ఐ కుంభకోణంలో కోట్లాది రూపాయల అవినీతిపై మాజీ మంత్రి కుమారుడిని ప్రశ్నించాల్సి ఉంది. కోవిడ్ కేర్ సెంటర్ లో పది మంది చనిపోయిన ప్రమాదంలో హాస్పిటల్ యజమాని విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here