సార్‌..ఆలోచించి మాట్లాడండి..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో పేచేయి సాధిస్తూ పోటీ ప్ర‌పంచంలో ప‌రిగెడుతున్న నేటి రోజుల్లో ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిలవాల్సిన ప్ర‌జాప్ర‌తినిధుల్లో కొంద‌రి వ్య‌వ‌హార‌శైలి ఆలోచింప‌జేస్తోంది. ఓవైపు ప్ర‌పంచ దేశాలు త‌ల‌మున‌క‌లై కోవిడ్ వ్యాక్సిన్ త‌యారు చేస్తుంటే మ‌రోవైపు ఆవుమూత్రం తాగితే చాలంటూ కొంద‌రు ప్ర‌సంగాలివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది.

ప‌శ్చిమ బెంగాల్ బీజేప అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోమూత్రం తాగితే వైరస్ రాదంటూ ఆయ‌న చెప్పారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే గోమూత్రం తాగాల‌న్నారు. అయితే తాను గోవుల‌పై చేస్తున్న వ్యాఖ్య‌లు కొంద‌రికి న‌చ్చ‌డం లేద‌న్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై విభిన్న రూపాల్లో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

గోమూత్రం మంచిదే అని ప‌లువురు చెబుతూ ఆయ‌న‌కు స‌పోర్టు చేస్తూనే వైర‌స్‌ల‌ను రానివ్వ‌కుండా ఇది ఎలా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గోమూత్ర‌మే ఇంత‌లా ప‌నిచేస్తే కోట్లాది రూపాయ‌లు పెట్టి వ్యాక్సిన్లు తయారుచేసేందుకు సైంటిస్టులు ఎందుకంత క‌ష్ట‌ప‌డ‌తార‌ని వ్యంగాస్త్రాలు వేస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన రాజ‌కీయాల్లో ఉన్న వారు ప్ర‌జ‌ల‌కు స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించాలే త‌ప్ప ఇలా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే మాట‌లు మాట్లాడ‌కూడ‌ద‌ని చెబుతున్నారు.

అయితే ఈయ‌న ఇప్పుడే కాదు గ‌తంలో కూడా ఆవు పాల‌లో బంగారం ఉంద‌ని చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో దుమారం లేచాయి. ఆ త‌ర్వాత ఓవ్య‌క్తి ఆవును తీసుకెళ్లి బ్యాంకు ద‌గ్గ‌ర పెట్టి ఇందులో  బంగారం ఉంద‌ని తాక‌ట్టు పెట్టుకోవాల‌ని చెప్పిన వార్త‌లు కూడా అప్ప‌ట్లో బాగా వినిపించాయి. కాగా కేవ‌లం ట్రెండింగ్‌లో ఉన్న అంశాల‌ను ఆస‌రాగా చేసుకొని ప‌బ్లిసిటీ కోస‌మే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా ప్ర‌జాప్ర‌తినిధ‌లు మాట్లాడే ప్ర‌తి ప‌దం కూడా స‌మాజంపై ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. సో లీడ‌ర్స్ ఇప్ప‌టికైనా మాట్లాడేట‌ప్పుడు కొంచెం ఆ..లోచించి మాట్లాడాల‌ని ప‌బ్లిక్ కోరుతున్నారు.‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here