ఆ రాష్ట్రాల‌కు స్పెష‌ల్ టీంలు పంపిన కేంద్ర ప్ర‌భుత్వం..

దేశంలో క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. దీంతో ప‌రిస్థితి చేజారిపోకుండా కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఏ రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయో గుర్తించి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకునేందుకు కేంద్రం క‌స‌ర‌త్తులు చేస్తోంది.

దేశంలో గత 24 గంటల్లో 45,209 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరింది. దీనిలో 85,21,617 కేసులు స్వస్థత పొందగా, మృతుల సంఖ్య 1,33,227కు చేరింది. వరుసగా 12వ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల కంటే తక్కువగా ఉండగా, జాతీయ రికవరీ రేటు 93.69 (85,21.617) శాతంగా ఉంది. మృతుల రేటు 1.46 శాతం కంటే తక్కువగా ఉంది.

ఇంత‌వ‌ర‌కు ఢిల్లీ, మ‌హారాష్ట్రల‌లో మాత్ర‌మే కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని అనుకున్నాం. అయితే కేంద్ర ప్ర‌భుత్వం స్పెషల్ టీంల‌ను ప‌లు రాష్ట్రాల‌కు పంపింది. కరోనా కేసులు, మృతుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి బృందాలను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పంపింది. కోవిడ్ రెస్పాన్స్ అండ్ మేనేజిమెంట్‌లో రాష్ట్రాలకు ఈ బృందాలు సహకరించనున్నాయి. ఇంతకుముందు, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్‌లకు కూడా కేంద్ర బృందాలను పంపడం జరిగింది.

దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం ఏం చెప్పిందంటే.. ముగ్గురు సభ్యుల బృందం కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో పర్యటిస్తుందని పేర్కొంది. కోవిడ్ నిరోధక చర్యలు పటిష్టం, నిఘా, పరీక్షలు, నిర్హహణలో రాష్ట్రాలకు బాసటగా నిలుస్తాయని తెలిపింది. సకాలంలో సమస్యను గుర్తించి సమర్ధవంతమైన చికిత్సకు అవసరమైన నిర్దేశకత్వాన్ని కేంద్ర బృందాలు అందిస్తాయని కేంద్రం ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here