ఢిల్లీలో క‌రోనా ప‌రిస్థితిపై ప్ర‌త్యేక ఆదేశాలు..

దేశరాజధానిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా కట్టడి చర్యలను ప్రారంభించింది. ఢిల్లీలో రాబోయే రెండువారాలు అత్యంత కీలకమైనవని భావించిన ఆరోగ్యశాఖ ప్రస్తుత పండుగ రోజుల్లో కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని నిర్ణయించింది. అదేవిధంగా ఏ విధమైన ఫ్లూ లక్షణం కనిపించినా వారు వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఢిల్లీలో సెప్టెంబరులో ప్రతీరోజూ 57 వేల వరకూ కరోనా టెస్టులు చేశామని, ఇప్పుడు ఈ సంఖ్యను రెండింతలు చేయాలని నిర్ణయించామన్నారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ మరోమారు పాక్షిక లాక్‌డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని అత్యధిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు లాక్‌డౌన్ విధించినప్పుడే పలు సమస్యలు ఎదుర్కొన్నామని, అందుకే మరోమారు లాక్‌డౌన్ విధించవద్దని వారు కోరుతున్నారు. తాము కోవిడ్-19 సోకకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతోపాటు, మాస్కులు ధరిస్తున్నామని, శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడికి పూర్తిగా లాక్ డౌన్ విధించడం సరికాదన్నారు.

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి నోయిడాకు వచ్చే ప్రయాణికులకు రాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలని గౌతమబుద్ధనగర్ జిల్లా అధికారులు నిర్ణయించారు. కరోనాను అరికట్టే వ్యూహంలో భాగంగా 11 మెట్రోరైలు స్టేషన్లు, రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో ప్రయాణికులకు రాండమ్ గా యాంటీజెన్ పద్ధతి ద్వారా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి నోయిడాకు ప్రతీరోజూ పెద్దసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో అందరికీ కాకుండా ఎంపిక చేసిన కొద్దిమంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని గౌతమబుద్ధనగర్ జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here