డిగ్రీ ప‌రీక్ష‌లు రాసిన మంత్రి.. ఫ‌లితాల గురించి ఆసక్తిక‌ర ట్వీట్ చేసిన ఎంపీ..

ఓ రాష్ట్ర మంత్రి డిగ్రీ ప‌రీక్ష‌లు రాశారు. అయితే ఆ ప‌రీక్ష‌ల ఫ‌లితాల గురించి ఓ ఎంపీ స్పందించారు. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి ప‌రీక్ష‌లు రాసి పాస‌య్యార‌ని ఎంపీ అన్నారు. అయితే ఇక్కడ వింతేమిటంటే.. ప‌రీక్ష‌లు రాసింది మంత్రి అయితే.. ఫ‌లితాల గురించి మాట్లాడిన ఎంపీ ఆయ‌న కుమారుడే.

ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ విష‌యం మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. విష‌య‌మేమిటంటే.. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి గ్రాడ్యుయేట్ మంత్రిగా నిలిచారు. తన తండ్రి అయిన మంత్రి ఏక్‌నాథ్ షిండే యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారని అతని తనయుడు, ఎంపీ శ్రీకాంత్ తాజాగా ప్రకటించారు. తన తండ్రి ఆర్ట్సులో 77.25 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారని కుమారుడు చెప్పారు.

ఈ మేర ఎంపీ శ్రీకాంత్ తన తండ్రి గ్రాడ్యుయేట్ అయ్యారని మరాఠీలో ట్వీట్ చేశారు. కుటుంబపోషణ కోసం చిన్న వయసులోనే చదువు మానేసిన ఏక్ నాథ్ షిండే మంత్రి అయ్యాక ఓపెన్ యూనివర్శిటీలో చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. తన తండ్రి లాగా పట్టుదలతో కష్టపడి చదివితే విజయం సాధించవచ్చిన ఎంపీ శ్రీకాంత్ చెప్పారు. ఇలా తండ్రీ కొడుకుల చ‌దువు గురించి చేసిన ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here