రూ.5 కోట్లు ఇవ్వ‌కుంటే క‌రోనా టీకాను అడ్డుకుంటాం..

క‌రోనా కేసులు తీవ్ర‌త‌రం అవుతున్న ప‌రిస్థితుల్లో ఓ వ్య‌క్తి క‌రోనా వ్యాక్సిన్ బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకుంటామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కొవిషీల్డ్’ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి తనకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ ఎస్ఐఐకి, డ్రగ్ లెగ్యులేటరీ అథారిటీకి లీగల్ నోటీసులు పంపాడు. కొవిషీల్డ్ టీకా టెక్నాలజీని ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది.

చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో జరుగుతున్న మూడోదశ ట్రయల్స్‌లో ఫిర్యాదుదారుడు పాల్గొన్నాడు. టీకా ట్రయల్స్‌లో పాల్గొన్న తాను తీవ్రమైన ప్రతికూల ప్రభావానికి గురయ్యానని, కాబట్టి రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని, లేదంటే టీకా బయటకు రాకుండా అడ్డుకుంటామని ట్రయల్స్‌లో పాల్గొన్న తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఆ నోటీసులో హెచ్చరించాడు. ఫిర్యాదుదారుడి తరపున నోటీసులు పంపిన న్యాయవాది ఆర్ రాజారామ్ మాట్లాడుతూ.. ఈ నెల 21న తాము పంపిన లీగల్ నోటీసుకు సమాధానం వస్తుందని ఎదురుచూస్తున్నామని, వచ్చే వారం కోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. లీగల్ నోటీసు కాపీలను ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్ ఆస్ట్రాజెనెకా యూకే చీఫ్ ఇన్వెస్టిగేటర్‌తోపాటు శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ వైస్ చాన్స్‌లర్‌కు కూడా పంపినట్టు న్యాయవాది తెలిపారు.

నోటీసులపై శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎస్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. దీనిపై దర్యాప్తు చేస్తామని, ప్రతికూల ప్రభావం వ్యాక్సిన్ వల్ల కాకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. నివేదికను ఎస్ఐఐకి చెందిన డేటా అండ్ సేఫ్టీ మోనిటరింగ్ బోర్డుకు సమర్పించినట్టు చెప్పారు. ట్రయల్స్ ఆగిపోలేదని, ఆపాలంటూ తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని వివరించారు. కాగా యూకేలో జరిగిన ట్రయల్స్‌లో ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ టీకా ట్రయల్స్‌ను నిలిపివేశారు. రెగ్యులేటరీ క్లియరెన్స్ తర్వాత ట్రయల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here