క‌రోనా వ్యాక్సిన్లలో ఏది బాగా ప‌నిచేస్తుందో ఈ విధానం ద్వారా తెలుసుకుంటారు..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు ప‌లు సంస్థ‌లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు దేశాలు వ్యాక్సిన్ త‌యారీలు మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఒక్కో వ్యాక్సిన్ ఒక్కో విధంగా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు కూడా సందేహాలు వ‌స్తున్నాయి. ఇంత‌కీ వ్యాక్సిన్ల సామ‌ర్థ్యాన్ని ఎలా అంచ‌నా వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేయడానికి ఓ చిత్రమైన మేథమెటికల్‌ ఫార్ములాను అమలు చేస్తున్నారు. స్వల్పకాలిక ప్రయోజనం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం, వాక్సిన్ల సామర్థ్యాన్ని అంచనావేయడం కోసం ఈ మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. స్వల్పకాలిక ప్రయోజనం తొలి దశ ట్రయల్స్‌లోనే తెల్సిపోతుంది. అన్నింటికన్నా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌లోనే అసలు వ్యాక్సిన్ల సామర్థ్యం రుజువవుతుంది.

మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చాలా కీల‌కంగా ఉంటాయి. వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలనే అంశంపై 1915లో ప్రచురితమైన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రముఖ మేథమేటీషియన్స్‌ ఎం. గ్రీన్‌ హుడ్, జీయూ యూలే ప్రతిపాదించిన మ్యాథమేటికల్‌ ఫార్ములానే నేటికీ ప్రమాణంగా ఉపయోగిస్తున్నారు. వైరస్‌ అటాక్‌ రేట్‌ (ఏఆర్‌) ఎంత శాతం తగ్గుతుందనే అంశంపైనే వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఇందుకోసం మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా రెండు వాలంటీర్ల బృందాన్ని ఎంపిక చేస్తారు. రెండు బృందాల సంఖ్య సమంగా ఉండేలా చూస్తారు. అలా కుదరని పక్షంలో ఏ బృందంలో ఎంత మంది ఉంటే ఎంత మందిపై ప్రభావం ఉందనేదాన్ని నిష్పత్తి ద్వారా నిర్ధారిస్తారు.

లెక్క కోసం రెండు బృందాల్లోనూ 50 మంది చొప్పున ఉన్నార‌నుకుంటే.. అందులో ఓ బృందానికి వ్యాక్సిన్‌ డోస్‌లు ఇస్తారు. మరో బృందానికి ‘ప్లేస్‌బో’ ఇస్తారు. ప్లేస్‌బో అంటే ఉత్తుత్తి మందు ఇస్తారు. ఏ బృందానికి నిజమైన వ్యాక్సిన్‌ ఇచ్చారో, ఏ బృందానికి ఉత్తుత్తి మందు ఇచ్చారో చెప్పరు. వారిపై ఎలాంటి మానసిక ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో రెండు బృందాలకు వ్యాక్సిన్‌ డోస్‌లే ఇచ్చామని చెబుతారు. కాకపోతే కాస్త ఎక్కువ, తక్కువ అని సర్ధి చెబుతారు. నిర్ధిష్టకాలంలో వారిపై కరోనా లాంటి వైరస్‌ల ప్రభావం ఎలా ఉందో పరిశీలిస్తారు.

వ్యాక్సిన్‌ డోస్‌లు తీసుకున్న వారిని ఏఆర్‌వీ గ్రూపని, తీసుకోని వారిని ఏఆర్‌యూ గ్రూపని వ్యవహరిస్తారు. ఏఆర్‌యూ గ్రూపులో ఎంత మంది ఉంటే ఎంత మందికి వైరస్‌ సోకిందీ అన్న లెక్కతో ఏఆర్‌వీ గ్రూపులో ఎంత మంది ఉంటే ఎంత మందికి సోకిందనే లెక్కవేసి, రిస్క్‌ రేట్‌ (ఆర్‌ఆర్‌)ను అంచనా వేస్తారు. రిస్క్‌ రేటు ఎంత తక్కువుంటే వ్యాక్సిన్‌ అంత సామర్థ్యంగా పనిచేస్తున్నట్లు లెక్క. రిస్క్‌ రేట్‌ పది శాతం ఉందనుకుంటే ఆ వ్యాక్సిన్‌ 90 శాతం పనిచేస్తున్నట్లు లెక్క. అదే రిస్క్‌ రేట్‌ 20 శాతం ఉంటే వ్యాక్సిన్‌ 80 శాతం పని చేస్తున్నట్లు లెక్క.

ఈ మూడు దశల క్లినికల్‌ అధ్యయనాలు పూర్తి కాకుండా వ్యాక్సిన్ల డోస్‌ల తయారీకి అనుమతి ఇవ్వకూడదంటూ దేశీయ, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు సూచిస్తున్నాయి. రష్యా తయారు చేస్తోన్న ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌కు కీలకమైన మూడవ ట్రయల్‌ను నిర్వహించకుండానే ఉత్పత్తికి, మార్కెటింగ్‌కు రష్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదాస్పదం అవడం తెల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here