చంద్రబాబు విశ్వాస ఘాతకుడు అంటూ నిప్పులు చెరిగారు. ఒమర్ అబ్దుల్లా

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం తెలుగు వారికే కాదు.. ఎక్కడో కశ్మీర్ లో ఉండే నేతలకు కూడా అర్థమవుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. ఆయన ఏమాత్రం నమ్మదగిన నేత కాదని విమర్శించారు.

ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ అబ్దుల్లా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవసరాల కోసం మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తమను సైతం చంద్రబాబు వాడుకున్నారని ఒమర్ విమర్శించారు. తమ రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు స్పందించకుండా ముఖం చాటేశారని మండిపడ్డారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నాడని తెలిసి కూడా మా నాన్న ఫరూక్ అబ్దుల్లా తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో ప్రచారాన్ని విడిచిపెట్టి మరీ ఏపీకి వచ్చి చంద్రబాబు పార్టీ కోసం ప్రచారం చేశాడని ఒమర్ తెలిపారు. మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి అన్యాయం చేస్తే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. అదీ ఆయన నైజం’ అని ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అన్యాయంగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలో ఉంచితే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒమర్ విమర్శించారు. ఆయన కోసం మేం అంత చేస్తే మా రాష్ట్రం కోసం మాకు మద్దతు ఇవ్వలేదని.. బాబు ఒక్క మాట మాట్లాడలేదని ఒమర్ విమర్శించారు. చంద్రబాబు విశ్వాస ఘాతకుడు అంటూ నిప్పులు చెరిగారు. భవిష్యత్ లో చంద్రబాబుకు గానీ.. అలాంటి నేతలను కానీ నమ్మేది లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here