బాబుకు కొత్త తలనొప్పి…?

రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు వివాదం మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు నొక్కేశార‌ని, ఆ లెక్క‌లు తేల్చాల‌ని కేంద్రం ఇప్పుడు మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వానికి తాఖీదులు పంపించింది. అయితే, ఈ లెక్క‌లు కూడా పాత‌వి తేల్చాల‌ని ష‌ర‌తు పెట్ట‌డంతో పోల‌వ‌రం వేడి బాబుకు బాగానే త‌గిలేట్టు ఉందే అనే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో బాగానే వినిపిస్తోంది. పోల‌వ‌రం భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ భూములు, అసైన్ట్‌ భూములకు మధ్య ఉన్న చెల్లింపుల వ్యత్యాసంపైనా కేంద్రం ప్రశ్నిస్తోంది. అయితే 2012 తర్వాత భూ సమీకరణకు చెల్లింపుల్లో తేడా లేదని రాష్ట్రప్రభుత్వం తెలిపినా.. కేంద్రం ఎక్క‌డో సంశ‌యిస్తోంది.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం.. అటవీ భూముల్లోని రైతులకూ పరిహారం చెల్లించాల్సి వస్తోందని రాష్ట్రం అంటోంది. అంతేకాదు, ఇవన్నీ చూశాకే తుది అంచనా వ్యయం రూ.48 వేల కోట్లకు కేంద్ర జల సంఘం ఆమోదించిందని పేర్కొంది. ఆ తర్వాత చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.699 కోట్లను పోలవరం ఖర్చులో ఎందుకు కలిపారని కేంద్రం నిలదీసింది. ఈ మొత్తాన్ని తుది అంచనాల నుంచి తీసేశామని రాష్ట్ర అధికారులు బదులిచ్చారు. కాగా.. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,300 కోట్లకు ఇదివరకే బిల్లులు వివరాలు పంపామని, ఆ మొత్తాన్ని రీయింబర్స్‌ చేయాలని కేంద్రాన్ని కోరారు. మరో రూ.500 కోట్లకు కూడా బిల్లులు పంపామని గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014కి ముందు చేసిన ఖర్చుకు సంబంధించిన అడ్వకేట్‌ జనరల్‌ ఆడిట్‌ పత్రాలు చూపించాల్సిందేనని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. అంతేకాదు, పోలవరానికి నిధుల కొరత రాకుండా గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిపైనా సానుకూలంగా స్పందించ‌లేదు. ప్రాజెక్టుకు నిధుల మంజూరుకు అంగీకరిస్తూనే.. షరతులు వర్తిస్తాయని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

ఈ క్ర‌మంలోనే 2014లో రాష్ట్ర విభజనకు ముందు ఈ ప్రాజెక్టుపై చేసిన రూ.5,500 కోట్ల వ్యయానికి సంబంధించి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఆడిట్‌ రిపోర్టును కూడా కేంద్రం కోరింది. ఈ ప‌రిణామాల‌తో బాబు హ‌యాంలో జ‌రిగిన విచ్చ‌ల‌విడి ఖ‌ర్చుల బాగోతం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అంద‌రూ అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇదే జ‌రిగితే.. బాబుకు మ‌రింత సెగ త‌ప్ప‌ద‌ని కూడా వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here