ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఒక కంపెనీః నారా లోకేష్‌

ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు, ఐటీనీ తాను డెవ‌లప్ చేస్తున్నాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్న‌ప్పుడు చేసిన కామెంట్ ఒక‌టి గుర్తుండే ఉంటుంది. ఏపీ ఒక సంస్థ‌గా భావిస్తే దానికి త‌ను సీఈఓను అని ప‌లు వేదిక‌ల్లో, విలేక‌రుల స‌మావేశాల్లో కూడా చెప్పారు. రాష్ర్టాన్ని కంపెనీలాగా మార్చేసిన చంద్ర‌బాబు అంటూ అప్ప‌ట్లో విప‌క్షాలు, వామ‌ప‌క్షాలు ఆందోళ‌న చేశాయి. అయితే ఇప్ప‌డు స‌రిగ్గా అదే ప‌దం న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చేసింది.
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఓ కంపెనీ అని ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్ప‌లేదు…ఆయ‌న త‌న‌యుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సెల‌విచ్చారు.  ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ 2017లో భాగంగా ‘సపోర్టింగ్ ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్స్ అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ అంశంపై విశాఖ‌ప‌ట్ట‌ణంలో జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న సరికొత్త ఆలోచనలు ఒకే వేదికపై పంచుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో పయనిస్తాయన్నారు. గతంలో పలు పారిశ్రామిక విప్లవాలు జరిగినప్పటికీ ఆయా దేశాలు అభివృద్ధి సాధించేందుకు దశాబ్దాల కాలం పట్టిందని మంత్రి లోకేష్ అన్నారు. అయితే, ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సింగపూర్ వంటి చిన్న దేశం రెండున్నర దశాబ్దాల కాలంలోనే అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధించిందన్నారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా రెండు దశాబ్దాల కాలంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ఒక కంపెనీ అని పేర్కొంటూ త‌మ‌కు మాత్ర‌మే  ఇంటింటికీ ఇంట‌ర్నెట్ అందించే వ్య‌వ‌స్థ ఉంద‌ని మంత్రి లోకేష్‌ తెలిపారు.
నూతన ఆలోచనలతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్ర లోకేష్‌ అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెచ్చామని, బయోమెట్రిక్, ఆధార్ లింకేజ్ వంటి చర్యలతో పథకాల్లో పారదర్శకతతో పాటు అవినీతిని అరికట్టగలిగామన్నారు. తద్వారా రాష్ట్రంలో 11.5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో మానవ వనరులకు, మేథో సంపత్తికి కొదవ లేదని లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణల్లో 35 శాతం మంది తెలుగువారేనన్నారు. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here