ఢిల్లీలో లాక్‌డౌన్‌పై కీల‌క అప్‌డేట్‌.. స్పందించిన మంత్రులు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తార‌న్న ప్ర‌చారం జోరందుకుంది. ఢిల్లీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును బ‌ట్టి మ‌రోసారి లాక్‌డౌన్‌లోకి ఢిల్లీ వెళుతోంద‌ని వ్యాపారులు అభిప్రాయ ప‌డ్డారు. లాక్‌డౌన్ వ‌ద్ద‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితుల్లో ఢిల్లీ ప్ర‌భుత్వ మంత్రులు దీనిపై స్పందించారు.

కరోనా కేసులు పెరిగిన కారణంగా తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నారన్న వార్తలపై ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. ఢిల్లీలో తిరిగి లాక్‌డౌన్ విధించడం అంటూ ఏమీ ఉండదని, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని నిబంధనలు విధించే అవకాశం మాత్రం ఉందని ఆయన వెల్లడించారు. స్థానికంగా ఉండే మార్కెట్లు హాట్ స్పాట్ సెంటర్లుగా మారుతున్నాయని, లాక్‌డౌన్ విధించడానికి అనుమతి కావాలంటూ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని అనుమతి కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుత తరుణంలో ఛట్ పూజ నిర్వహించడం ద్వారా కోవిడ్ పాకే ప్రమాదం ఉందని, అందుకే కొన్ని ఆంక్షలు విధించాలని తాము కోరుతున్నట్లు సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా స్పందించారు. పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని ఎవరూ ఆలోచించడం లేదని, లాక్‌డౌన్ విధిస్తున్నామన్న తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్ విధించడం అనేది సమస్యే కాదని తాము ముందు నుంచీ చెబుతూనే ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. మెరుగైన చికిత్స, వైద్యం, వైద్య సదుపాయాల వల్ల మాత్రమే కరోనాను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. కేంద్రం ఇప్పటికే ఓ మారు లాక్‌డౌన్ విధించి, ఆంక్షలు సడలించిందని ఆయన గుర్తు చేశారు. దాని తర్వాత పరిణామాలను దేశం మొత్తం చూసిందని, కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు.

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల్లో ఢిల్లీ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అంద‌రూ లాక్‌డౌన్ విధిస్తార‌నే అనుకున్నారు. కాగా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఏ నిర్ణయ‌మైన తీసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here