కాంగ్రెస్ పార్టీలో గొడ‌వ‌ల‌పై సోనియా, రాహుల్ స్పందిస్తారా..

బీహార్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభ‌వం ఎదురైన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ భారీగానే ఆశ‌లు పెట్టుకున్నా చివ‌ర‌కు ఫ‌లితాలు మాత్రం ఆశించినంత రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడులు చేసుకుంటున్నారు.

పార్టీకి పునరుత్తేజం రావాలంటే అనుభవంతో కూడిన ఆలోచనలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించ గల సామర్థ్యంతో పాటు రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమని మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తాము ఆశించిన స్థాయిలో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదని కపిల్‌ సిబల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలివైనదని, ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో తప్పకుండా గుర్తిస్తుందన్నారు.

క‌పిల్ సిబ‌ల్ వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీ నేత‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్‌ను విమర్శిస్తారో వారు ఇతర పార్టీలో చేరిపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ప్రతిసారీ ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే బదులు… కొత్త పార్టీలో చేరవచ్చని, లేదా… వారే ఓ కొత్త పార్టీని స్థాపిస్తే బాగుంటుందని కపిల్ సిబాల్‌కు అధీర్ చురకలంటించారు. కాంగ్రెస్‌పై ప్రతిరోజూ విమర్శలు చేసే వారు గాంధీ కుటుంబానికి, అధిష్ఠానానికి బాగా దగ్గరి వ్యక్తులని, ఏవైనా సమస్యలుంటే వారు నేరుగా అధిష్ఠానం ముఖ్యులతో సంప్రదిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.

బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయానికి నాయకత్వాన్ని తప్పుబట్టడం సరికాదని సీనియర్‌ నేత, మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఆయన అగ్రనేతలకు బాసట ప్రకటించారు. ’అనుమానపు పక్షులు, సందేహాస్పదులు అప్పుడప్పుడూ ఈ నొప్పులతో బాధపడుతుంటారు. వారు పద్ధతి మార్చుకోవాలి’ అంటూ ఆయన మాజీ మంత్రి కపిల్‌ సిబ్బల్‌ను ఆక్షేపించారు. ’ఉదారవాద విధానాలను, విలువలను కాంగ్రెస్‌ పార్టీ దీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చింది. వీటిని ఓటర్లు వ్యతిరేకించినపుడు మనం వాటికోసం, ప్రజాస్వామ్యం కోసం దీర్ఘకాలం పోరాడాలే తప్ప అధికారం కోసం దగ్గరి దారులు వెతుక్కోరాదు. ఆటుపోట్లుంటాయి.. గుడ్డిగా నమ్మకపోయినా విధిపై విశ్వాసం ఉంచాలి’’ అని సల్మాన్‌ ఖుర్షీద్‌ ఓ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం అదిష్టానం దృష్టికి ఇప్ప‌టికే వెళ్లి ఉంటుంద‌ని అంటున్నారు. అయితే రాహుల్ బీహార్ ఫ‌లితాల‌పై ఓ సారి చ‌ర్చిస్తేనే ఈ మాట‌ల యుద్దం ఆగుతుంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here