జ‌గ‌న్ టీంలోకి “గంటా” ముహూర్తం ఫిక్స్‌.

ఏపీలో అధికార పార్టీకి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. కొన్ని రోజులుగా జోరుగా ప్ర‌చారం అందుకున్న మాజీ మంత్రి గంటా వ్య‌వ‌హారం కొలిక్కి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ మేర‌కు కీల‌క నేత‌ల మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

2019 ఎన్నిక‌ల అనంత‌రం వైసీపీ అధికారం చేపట్టిన‌ప్ప‌టి నుంచి గంటా శ్రీ‌నివాస‌రావు పార్టీ మార‌తార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే అది నేటి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే ఈ సారి మాత్రం ఇది జ‌రిగే తీరుతుంద‌ని పొలిటిక‌ల్ చ‌ర్చ బ‌లంగా ఉంది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా గంటా రాక‌పై సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌ల‌మైన నేత గంటా పార్టీలోకి వ‌స్తే అన్నివిధాలా మేలు జ‌రుగుతుంద‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

గంటా శ్రీ‌నివాస‌రావు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు మంచి స్నేహ‌పూర్వ‌క సంబంధం ఉంది. గ‌తంలో ఇద్ద‌రు మంత్రులుగా క‌లిసి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో గంటా రాక కోసం బొత్స చొర‌వ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్యే మీడియాతో మాట్లాడిన బొత్స త‌మ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తోంద‌న్నారు. అధికార పార్టీ అభివృద్ధిని చూసి ఎంతో మంది నేత‌లు ఆక‌ర్షితులవుతున్నార‌ని చెప్పారు. ఈ మాట‌లు గంటాను ఉద్దేశించి మాట్లాడిన‌వే అంటూ ప‌లువురు నేత‌లు క్లారిటీ ఇస్తున్నారు.

ఇక విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మాత్రం గంటా రాక‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో గంటా, అవంతి మ‌ధ్య మంచి సంబంధాలే ఉన్న‌ప్ప‌టికీ గంటా పార్టీలోకి వ‌స్తే త‌నకు ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌ని ఆయ‌న ఫీలింగ్‌. దీంతో గంటా రాక‌ను వ్య‌తిరేకిస్తూ పార్టీ అదిష్టానానికి ఇప్ప‌టికే స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇక ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ ఖ‌రార‌వ్వ‌డంతో అక్క‌డ అన్ని హంగులు రెడీ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో బ‌ల‌మైన నేత కూడా ఉండాల‌ని నేత‌లు అనుకుంటున్నారు. ఈ మేర‌కు మ‌రో వారం ప‌ది రోజుల్లో గంటా వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి బ‌లం చేకూర్చుతూ గంటా ఇటీవ‌ల ఎవ్వ‌రినీ విమ‌ర్శించ‌కుండా సైలెంట్‌గా ఉంటున్నారు. వీట‌న్నింటిని బ‌ట్టి చూస్తే క‌చ్చితంగా వై.ఎస్ జ‌గ‌న్ జ‌ట్టులో గంటాకు చోటు ఖాయ‌మైన‌ట్లు అనిపిస్తోంది. మొత్తం మీద ఇప్పుడు గంటా వ్య‌వ‌హారం అధినేత జ‌గ‌న్ చేతిలోనే ఉంది. ఆయ‌న ఎలా నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని పార్టీ వ‌ర్గాలు వేచిచూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here