వర్మ టార్గెట్ మెగా ఫ్యామిలీనా..?

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టార్గెట్ ఏంటో ఎవ్వరికి అర్థం కావడం లేదు. రోజుకో వివాదాస్పద అంశంతో పబ్లిక్లోకి వచ్చే ఈయన తాజాగా మెగా కుటుంబంపై పడ్డారు. మొన్న పవర్ స్టార్ అన్నాడు నేడేమో అల్లు అంటూ కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన తీస్తున్న ప్రతి మూవీ వివాదాస్పదమే. అయితే ఆ వివాదాస్పద సినిమాల్లో మెగా కుటుంబానికి చెందిన వారినే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి కచ్చితంగా మెగా ఫ్యామిలీని బ్యాడ్ చేయాలనే వర్మ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎవరికైనా ఇట్లే తెలిసిపోతుంది. దర్శకుడిగా ఎలాంటి చిత్రాలు తీయడానికైనా ఆయనకు హక్కు ఉన్నప్పటికీ ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం.. అదీ మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

మొన్న పవర్ స్టార్ ఇది ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ ఓ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నికల తర్వాత పవన్ ఏం చేశాడు, ఎలా ముందుకు వెళ్ళాడో చూపించాడు. చిరంజీవి పవన్ తో మాట్లాడటం, సినిమా కథలు వినడం, నాగబాబు ఫోన్లో మాట్లాడటం ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్లి పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితంలోకి కూడా వెళ్లారు. ఇదే విషయంపై తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి రాంగోపాల్ వర్మ పై మండిపడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో డెవలప్ అయ్యి ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు.

ఇప్పుడు తాజాగా వర్మ మరో వివాదాస్పద మూవీకి సిద్ధమయ్యారు. అల్లు అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయన బామర్ది ఏం చేసాడనేది చూపించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సినిమాలో పాత్రల పేర్లు కూడా ప్రకటించారు. ఎ. అరవింద్, కె.చిరంజీవి, పవన్ కల్యాణ్, కె.ఆర్ చరణ్ ఇలా పేర్లు చెప్పేసాడు వర్మ. దీన్ని బట్టి కచ్చితంగా ఇది అల్లు అరవింద్ ను టార్గెట్ చేసి తీస్తున్న సినిమా అని ఎవ్వరికైనా అర్థం అవుతుంది. అల్లు సినిమా ప్రకటించినప్పటి నుండి ఇండస్ట్రీలో మళ్ళీ వర్మ టాపిక్ మొదలైంది. మొన్న ప్రెస్ మీట్ లో వర్మపై అల్లు అరవింద్ ఘాటుగా స్పందించడంతోనే ఇలా సినిమా ప్లాన్ చేసారని అంతా అనుకుంటున్నారు.

 

అయితే ఇటీవల చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు భేటి అయినట్లు సమాచారం. వివాదస్పద సినిమాలు తీస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చర్చ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వర్మపై నిజంగా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. మరోవైపు వర్మ వ్యవహారం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తులను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం మంచిది కాదని పలువురు చర్చించుకుంటున్నారు. మరోసారి వివాదాస్పద సినిమా తీస్తున్న వర్మ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here