అంద‌రూ బాగా తిట్టారు.. ఆ త‌ర్వాత వీళ్లు మారారు..

దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న ప‌రిస్థితుల్లో బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ తీసుకొచ్చిన మేనిఫెస్టో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బీహార్ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో ఈ మేనిఫెస్టో దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.

బీజేపీ మేనిఫెస్టో ప‌ట్ల ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమన్నాయి. బీహార్ మాత్ర‌మే ఇండియాలో ఉందా.. ఇత‌ర రాష్ట్రాలు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో ఉన్నాయా అని వ్యంగంగా ప్ర‌శ్నించాయి. గ‌త మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా ఈ అంశం కుదిపేసింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, అసోం, పుదుచ్చేరి ప్రభుత్వాలు తమ రాష్ట్రాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ డిమాండు చేశారు.దీంతో బీజేపీ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప సారంగి చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. బాలాసోర్ ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మంత్రి సారంగి ఈ విషయం చెప్పారు. ప్రతీ వ్యక్తికి కొవిడ్ టీకా వేయడానికి రూ.500 ఖర్చు చేస్తామని మంత్రి చెప్పారు. ఒడిశా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ప్రతాప సారంగి, ధర్మేంద్ర ప్రధాన్ లను ఒడిశాలో ప్రజలకు వ్యాక్సిన్ అందించడంపై ఒడిశా రాష్ట్ర మంత్రి ఆర్పీ స్వైన్ ప్రశ్నించారు. దీంతో కేంద్రమంత్రి స్పందిస్తూ దేశ పౌరులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here