ఇండియాలో క‌రోనా వ్యాక్సిన్‌ను ఇలా పంపిణీ చేయ‌బోతున్నారు..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తే ఎలా పంపిణీ చేయాల‌న్న దానిపై కేంద్ర ప్ర‌భుత్వం ఓ క్లారిటీకి వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. నాలుగు వ‌ర్గాలుగా విభ‌జించి మొద‌ట వీరికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు రచించింది. కరోనా టీకాలు వేసేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పుడు మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

ఇండియాలో త‌యారుచేస్తున్న భార‌త్ బయోటెక్ కోవాక్సిన్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రారంభంలో వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ముందునుంచీ అంచ‌నా వేసిన‌ట్లుగానే ఫిబ్ర‌వ‌రిలో ఈ వ్యాక్సిన్ వ‌స్తుంది. పైసా ఖర్చు లేకుండా ప్రాధాన్య సమూహాలను గుర్తించి వ్యాక్సిన్ ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నిపుణులతో చర్చించి 30 లక్షలమంది ప్రాధాన్య సమూహాలను గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో ప్రాధాన్యత క్రమం ప్రకారం నాలుగువర్గాలుగా విభజించి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కోటి మంది ఆరోగ్యనిపుణులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్మికులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఫ్రంట్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలకు చెందిన 2 కోట్ల మందికి రెండో విడత వ్యాక్సిన్ ఇస్తారు.

మూడో వర్గమై 50 ఏళ్లు పైబడిన 6 కోట్లమంది వృద్ధులకు, వయసు ప్రాధాన్యతా క్రమంగా వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 50 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్న కోటిమందిని ప్రత్యేక వర్గంగా గుర్తించి వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఆధార్ కార్డు లేకపోయినా ప్రభుత్వ ఫొటో గుర్తింపును ఉపయోగించుకొని లబ్ధిదారులను గుర్తించి వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా ఇప్ప‌టికే క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇండియాలో కూడా మ‌రో నెల రోజుల్లో క‌రోనా కేసులు పెరుగుతాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ ఎంత త్వ‌ర‌గా పంపిణీ చేస్తే అంత మేలన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here