దీపావ‌ళికి సంబ‌రాలు చేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డం క‌రెక్టేనా..

దీపావ‌ళి పండుగ వ‌చ్చేస్తోంది. దీంతో దేశం మొత్తం సంబ‌రాలు చేసుకోవ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. అయితే కాలుష్యాం కార‌ణంగా క‌రోనా మ‌రింత విజృంభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లు రాష్ట్రాలు దీపావళికి బాణ‌సంచ కాల్చ‌కూడ‌ద‌ని నిషేధం విధిస్తున్నాయి. దీన్ని ప‌లువురు వ్య‌తిరేకిస్తున్నారు.

దీపావళి పండుగకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చైనా పటాకుల విక్రయం, వినియోగాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా దేశ పటాకులు నిల్వ, రవాణా, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. నిషేధిత చైనా పటాకులను ఎవరైనా విక్రయిస్తే వారిపై పేలుడు పదార్థాల చట్టం కింద చర్యలు తీసుకోవాలని సీఎం చౌహాన్ హోంశాఖ అధికారులు, డీజీపీని ఆదేశించారు. చైనా దేశం నుంచి పటాకులను దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధమని, దీన్ని నిషేధించామని రాజేష్ పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం కూడా బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది. దీపావళి, కార్తిక పూర్ణిమ పండుగల సందర్భంగా బాణసంచా విక్రయించరాదని, కాల్చరాదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 10 నుంచి 30వతేదీ వరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకే త్రిపాఠి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చరాదని ప్రభుత్వాలు ఆదేశించడంపై స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం సరికాదని తెలిపింది. ఈ సంస్థ జాతీయ సహ సమన్వయకర్త డాక్టర్ అశ్వని మహాజన్ విడుదల చేసిన ప్రకటనలో బాణసంచాపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు. బాణసంచా వల్ల దుష్ఫలితాలు వస్తాయనే దుష్ప్రచారాన్ని నిలిపేయాలని కోరారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధించడం సరికాదని చెప్పారు.

వాస్తవ సమాచారం లేకుండా ప్రభుత్వాలు బాణసంచాపై నిషేధం విధించడం పూర్తిగా సరైనది కాదన్నారు. పూర్తి స్థాయిలో నిషేధం విధించవద్దని ప్రభుత్వాలను కోరారు. బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యానికి ప్రధాన కారణం చైనా నుంచి చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్న బాణసంచా అని వివరించారు. చైనా బాణసంచాలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ కలుపుతారని చెప్పారు. మన దేశంలో తయారయ్యే బాణ సంచా కాలుష్య రహితమైనదని చెప్పారు. మన దేశంలో తయారయ్యే బాణసంచాకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here