నెల రోజుల్లోపే క‌రోనా సెకండ్ వేవ్‌..?

క‌రోనా సెకండ్ వేవ్ ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో వ‌చ్చేసింది. క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో మ‌రో నెల రోజుల్లోపే క‌రోనా సెకండ్ వేవ్ వ‌స్తుందంటున్నారు.

క‌రోనా ఎలాంటి ఉగ్ర‌రూపం చూపించిందో మ‌న‌కు తెలిసిందే. ప్ర‌తి రోజూ వేల‌కు వేల కేసులు న‌మోద‌వ్వ‌డ‌మే కాకుండా వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడే కాస్త క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. పైగా క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది కాస్త ఊపిరి పీల్చుకునే అంశ‌మే అయినా రెండో సారి క‌రోనా విజృంభిస్తుంద‌న్న వార్త‌ల‌తో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఇది డిసెంబ‌ర్ 15లోపే వ‌చ్చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ మాటలు చెప్పింది ఎవ‌రో కాదు. రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ.

ఈ సంవత్సరం డిసెంబరు 15వతేదీ లోపు కరోనా సెకండ్ వేవ్ రావచ్చని వైద్యనిపుణులు హెచ్చరించారని, కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయ‌న చెప్పారు. శీతాకాలంలో స్వైన్ ఫ్లూ, డెంగీ, జలుబు, దగ్గు, కాలుష్యం పెరుగుతుందని, దీనివల్ల కరోనా కేసులు కూడా పెరుగుతాయని మంత్రి హెచ్చరించారు. ప్రజలు మాస్కులు ధరించి నెలరోజుల పాటు క్రమశిక్షణ పాటిస్తే కరోనా వైరస్ గొలుసు విచ్ఛిన్నం అవుతుందని మంత్రి చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీకా కంటే మాస్కులు ధరించడం మంచిదని, ఎందుకంటే టీకా ప్రభావం 60 శాతానికి మించదని, కాని క్రమం తప్పకుండా మాస్కులు ధరించడం ద్వారా, కరోనా సంక్రమణ అవకాశాలు 90 శాతం తగ్గుతాయని ఆయ‌న అన్నారు. దీన్ని బ‌ట్టి క‌రోనా కేసులు పెరుగుతాయా అన్న ఆందోళ‌న మొద‌లైంది. దీన్ని బ‌ట్టి ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here