క‌రోనా సెకండ్ వేవ్‌.. పెరుగుతున్న కేసులు..

దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దీంతో సెకండ్ వేవ్ మొద‌లైంద‌ని అంతా ఆందోళ‌న చెందుతున్నారు. చలికాలం ప్రారంభం కారణంగా ఒడిశా రాష్ట్రంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాగా దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం భారీగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఒకేరోజు ఢిల్లీలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఆదివారం అత్యధికంగా 7,745 కేసులు నమోదుకాగా.. తాజాగా నమోదైన కేసుల సంఖ్య ఆదివారం రికార్డును దాటేసింది. కొత్తగా నమోదైన కేసులతో ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. మరోపక్క మంగళవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 83 మంది మృత్యువాతపడ్డారు.

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వరులో వివాహ ఊరేగింపులను నిషేధిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వివాహ కార్యక్రమాల్లో 100మంది, అంత్యక్రియలకు 50 మంది మాత్రమే హాజరయ్యేలా మార్గదర్శకాలను విడుదల చేసింది. వివాహ కార్యక్రమాలకు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, వృద్ధులు, గర్ణిణులు, అనారోగ్యంతో ఉన్న వారు హాజరుకావద్దని కొవిడ్ మార్గదర్శకాల్లో అధికారులు కోరారు.

తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఫంక్షన్లకు హాజరు కావద్దని సూచించారు.ఒడిశాలో మళ్లీ తాజాగా ఒక రోజే 987 కరోనా కేసులు నమోదైనాయి. దీంతో వివాహ ఊరేగింపులను నిషేధం విధించారు. ఒడిశాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.03 లక్షలకు చేరింది.ఒడిశాలో కరోనా వైరస్ వ్యాప్తితో నవంబరు చివరి వరకు పటాకులు కాల్చడాన్ని నిషేధించారు. డిసెంబరు చివరి వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రబలుతుండటంతో పరీక్షలు కూడా పెంచారు. దీంతో మ‌ళ్లీ దేశం మొత్తం లాక్‌డౌన్ విధిస్తారా అన్న ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here