12 ఓట్ల తేడాతో ఓట‌మి చెందిన ఆ నాయ‌కుడు ఎవ‌రో తెలుసా..

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ‌గా మారిన బీహార్ ఎన్నిక‌లు ముగిసాయి. ఎన్డీయే మెజార్టీ సాధించింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా గ‌ట్టి పోటీ ఇచ్చాయి. కాగా ఈ ఎన్నిక‌ల్లో ఓ అభ్య‌ర్థి కేవ‌లం 12 ఓట్ల తేడాతో ఓడిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

బీహార్ ఎన్నిక‌ల్లో ఆర్జేడీ తరపున హిల్సా (నలందా జిల్లా) నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే శక్తిసింగ్ యాదవ్ విష‌యంలో ప‌రిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి. మొద‌ట ఆయ‌న గెలిచార‌ని అంతా అనుకున్నారు. చివ‌ర‌కు ఆయ‌న స్వ‌ల్ప తేడాతో ఓడిపోయార‌ని చెప్ప‌డంతో నిరాశే ఎదురైంది. అస‌లు ఏమైందంటే.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ అప్‌డేట్‌ను అనుసరించి జేడీ(యూ) అభ్యర్థి కృష్ణ మురారీ శరణ్ ఉరఫ్ ప్రేమ్ ముఖియాకు 61,848 ఓట్లు వచ్చాయి. ఇతనికి ప్రత్యర్థిగా ఆర్జీడీ తరపున పోటీచేసిన శక్తి‌సింగ్ యాదవ్ ఉరఫ్ అత్రిమునికి 61,836 ఓట్లు వచ్చాయి. హిల్సా సీటుకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో… కౌంటింగ్‌లో గందరగోళం చోటుచేసుకున్నదని ఆర్జేడీ ఆరోపణలు గుప్పించింది.

ఈ సందర్బంగా పార్టీ చేసిన ట్వీట్‌లో హిల్సా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆర్జేడీ అభ్యర్థి శక్తిసింగ్‌ 547 ఓట్ల తేడాతో గెలిచారని ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే సర్టిఫికెట్ తీసుకునేందుకు వెయిట్ చేయాలని చెప్పారు. కొద్దిసేపటి తరువాత అదే అధికారి పోస్టల్ ఓట్లను రద్దు చేసిన కారణంగా ఆర్జేడీ అభ్యర్థి శక్తిసింగ్‌ కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని తెలిపారన్నారు. అయితే ఎన్నికల అధికారి దీనిపై ఎవరో ఒత్తిడి చేశారన్ని ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. కాగా ఎన్నిక‌ల్లో మోదీ హ‌వా క‌నిపించింది. ఓట‌ర్లు జేడీయూ క‌న్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు కట్ట‌బెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here