భార‌త్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు.

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించినప్పటికీ తాజాగా మళ్లీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 4,43,794. భారత్‌ను కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడిన వారిలో 584 మంది మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 1,32,162 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు.

ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం ఫిబ్రవరి 2021 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని, సామాన్య ప్రజలకు ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకు గానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా తెలిపారు. ఇప్పటికే నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆమోదం లభిస్తే, 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here