మ‌హిళా ఎమ్మెల్యే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..

త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఓ మ‌హిళా ఎమ్మెల్యే ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. తిరునల్వేలి జిల్లా ఆలంకుళం నియోజకవర్గం డీఎంకే శాసనసభ్యురాలు ఆలడి అరుణా పూంగోదై ఆత్మహత్యాయత్నం చేసి తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పార్టీ అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమె అధికమోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటీవల కడయంలో జరిగిన డీఎంకే సమావేశంలో తెన్‌కాశి జిల్లా డీఎంకే శాఖ కార్యదర్శి శివ పద్మనాభన్‌తో ఆమె గొడవ పడ్డారని, దీంతో ఆమె విరక్తి చెంది నిద్రమాత్రలు వేసుకున్నట్టు తెలిసింది. కడయం సభలో ఆలడి అరుణా పూంగోదైకి, తెన్‌కాశి డీఎంకే జిల్లా కార్యదర్శి శివపద్మనాభన్‌కు మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమేనని ఆలకుళం పోలీసు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అయితే ఆ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారా లేదో ఖచ్చితంగా తెలియడం లేదని. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన వెల్లడించారు.

అరుణా పూంగోదై ఎంపీ కనిమొళి వర్గానికి చెందినవారు కాగా, తెన్‌కాశి డీఎంకే జిల్లా శాఖ కార్యదర్శి శివపద్మనాభన్‌ ఎంకే స్టాలిన్‌కు మద్దతుదారుడు. కడయంలో జరిగిన డీఎంకే సభలో ఆలడి అరుణా పూంగోదైని శివపద్మనాభన్‌ అనుచరుడు శివన్‌ పాండియన్‌ అసభ్యపదజాలంతో దూషించారని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యకు గల కారణాలు బహిర్గతం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here