ఏపీలో మిడ‌త‌ల దండు… రైతుల ప‌రిస్థితి ఎలా..?

దేశంలో అన్న‌దాత‌లను భ‌య‌పెడుతున్న మిడ‌త‌లు ఇప్పుడు ఏపీలో కూడా భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి. తాజాగా రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు జిల్లాలో ఇవి ప్ర‌వేశించాయ‌న్న వార్త‌లతో ఒక్క‌సారిగా అంతా ఉలిక్కిపడ్డారు.

క‌ర్నూలు జిల్లాలోని ఆదోని, మంత్రాల‌యం, ఎమ్మిగ‌నూరు, ఆలూరు, త‌దిత‌ర ప్రాంతాల్లోని ప‌త్తి పంట‌పై మిడ‌త‌లు విజృంభిస్తున్నాయి. వంద‌ల సంఖ్య‌లో ఇవి పంట‌పై వాలిపోవ‌డంతో రైతులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వీటి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో వెంట‌నే స్థానిక నంద్యాల ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా కేంద్రం శాస్త్ర‌వేత్త‌ల‌కు స‌మాచారం అంద‌జేశారు.

వీటిని ప‌రిశీలించిన శాస్త్ర‌వేత్త‌లు రైతుల‌కు శుభవార్త చెప్పారు. ఇవి స్థానికంగా ఉండే మిడ‌త‌లు మాత్ర‌మే అన్నారు. వ‌ల‌స మిడ‌తలు కాద‌న్నారు. వీటి వ‌ల్ల పంట పొలాల‌కు ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌ద‌ని తెలిపారు. వీటి నివార‌ణ కోసం నీమ్ ఆయిల్‌, క్లోరి ఫెరిఫాస్ మందులు పిచికారి చేస్తే సరిపోతుంద‌న్నారు. ఇవి కేవ‌లం 200లోపే గుంపుగా ఉండి పంట‌ల‌పై వాలుతుంటాయ‌న్నారు. అధికారులు వీటి గురించి పూర్తిగా వివ‌రించ‌డంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

వాస్త‌వంగా వ‌ల‌స మిడ‌త‌ల దండు మ‌న దేశంపై కూడా పూర్తిస్తాయిలో దాడులు చేస్తుందేమో అన్న భ‌యం రైతుల్లో ఉన్న విష‌యం వాస్త‌వ‌మే. అయితే వ‌ల‌స మిడ‌త‌ల‌కు, స్థానిక మిడ‌త‌ల‌కు తేడా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here