మ‌రో ఆరు జిల్లాల‌కు ఆరోగ్యశ్రీ విస్త‌ర‌ణ

వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమ‌వారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించ‌నుంది. సోమ‌వారం సీఎం జ‌గ‌న్ త‌న‌ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్‌తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామని జగన్ ఎన్నిక‌ల్లో‌ హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. అందులో భాగంగా అప్పటివరకూ ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, కొత్త‌గా మ‌రిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు. ఆ త‌ర్వాత‌ అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. ఆ త‌ర్వాత అమలయ్యే వైద్యప్రక్రియల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపచేసేవారు. అదికూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లింపులు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి దాపురించేది. వీటిపైనా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతోపాటు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు. 2019 జూన్‌ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315 కోట్లను ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here