హ్యాట్సాఫ్ ‌గ్రాండ్ మదర్…మ‌నిషి అనుకుంటే చెయ్యలేనిది లేదు.

మ‌నిషి అనుకుంటే చెయ్యలేనిది ఏదీ లేద‌న్న‌ది తెలిసిందే.. అది ప్ర‌తి రంగంలో ఏదో ఒక చోట నిరూపిత‌మ‌వుతూనే వ‌స్తోంది. తాజాగా ఇప్పుడు మేఘాల‌య‌లో జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం.. ఐదు ప‌దుల వ‌య‌సులో 12వ త‌ర‌గ‌తి పూర్తిచేసిన ఈ మ‌హిళ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సాదార‌ణంగా పిల్ల‌లు త‌ల్లిదండ్రులు త‌లెత్తుకునేలా చేశారు అనే మాట‌లు మ‌నం వింటుంటాం. కానీ ఇక్క‌డ త‌ల్లే త‌న పిల్ల‌లు త‌లెత్తుకునేలా చేసింది. విష‌యం ఏంటో తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే. మేఘాల‌య చెందిన ల‌కింటువు అనే మ‌హిళ‌కు త‌న 21ఏటే పెళ్ల‌యింది. 1989లోనే పాఠ‌శాల చ‌దువు నుండి త‌ప్పుకుంది. ఆ త‌రువాత ఆమెకు పెళ్లి అవ్వ‌డం, ఆమె పిల్ల‌ల‌కు కూడా పెళ్ళిల్ల‌వ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే మ‌న‌వ‌రాళ్ల‌కు చ‌దువు చెప్పించాల్సిన వ‌య‌సులో ల‌కింటువుకు మ‌ళ్లీ చ‌దువుపై మ‌న‌సు ప‌డింది. దీంతో వెంట‌నే మ‌ళ్లీ పుస్త‌కాల పురుగులా చ‌ద‌వ‌డం ప్రారంభించింది.

అప్ప‌ట్లో భయంతో చ‌దువు మానేసిన ఈమె మళ్లీ 2015లో ఓపెన్ స్కూల్ ద్వారా త‌న విద్యాబ్యాసాన్ని ప్రారంభించింది. ఇంట్లో కూతురు కూడా త‌న చ‌దువును ప్రోత్స‌హించ‌డంతో ఆమెకు అడ్డులేకుండా పోయింది. ఎలాంటి ఇబ్బందులున్నా ధైర్యంగా ఎదుర్కొని సాఫీగా త‌న 12వ తర‌గ‌తిని పూర్తి చేసింది. చ‌దువుపై ఈ గృహిణికి ఉన్న ఇష్టం ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లిందంటే ఈమె ఎంత‌గా క‌ష్ట‌పడిందో అర్థం చేసుకోవచ్చు. మేఘాల‌య విద్యాశాఖా మంత్రి లాహ్మెన్ రియంబు చ‌దువుప‌ట్ల‌ ల‌కింటువుకున్న ప‌ట్టుద‌ల‌ను ప్ర‌శంసించారు.

నేటి ప‌రిస్థితుల‌ను ఒక్క‌సారి గ‌మ‌నిస్తే చ‌దువుకుంటున్న వ‌య‌స్సులో చిన్న చిన్న ఇబ్బందులు వ‌స్తే చాలు చ‌దువు మానేస్తుంటారు. ఇక పెళ్ల‌యితే మ‌న‌కేం అవ‌స‌రంలే అని కొంద‌రు వంటింటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఈ త‌రుణంలో 32 ఏళ్ల త‌ర్వాత త‌ను చ‌ద‌వి అంద‌రికీ ఆద‌ర్శంగా నిల‌వ‌డం ల‌కింటువుకే సాధ్యమైంది. ఖాసీ భాష‌లో గ్రాడ్యుయేష‌న్ చేయ‌డ‌మే త‌న త‌ల్లి ల‌క్ష్య‌మ‌ని ఆమె కూతురు గ‌ర్వంగా చెబుతోంది. సాదార‌ణంగా పిల్ల‌లు త‌ల్లితండ్రుల పేర్లు నిల‌బెడ‌తార‌ని విన్నాం.. కానీ ఇక్క‌డ త‌ల్లే త‌న పిల్ల‌లు గ‌ర్వంగా ఉండేలా చేస్తుంది.హ్యాట్సాఫ్ మదర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here