మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్….

రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరులు మోకా భాస్కర్‌రావు హత్య కేసు సంచలన మలుపు తీసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు మధ్యలోనే ఆపేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం మాజీ మంత్రిని తుని నుంచి విజయవాడకు తరలించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీలను అరెస్టు చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. కాగా, మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు భాస్కర్ రావు హత్య కేసులో విచారణ నిమిత్తం కొల్లు రవీంద్ర ఇంటిని శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీ చేశారు. రవీంద్ర కోసం పోలీసులు ఆయన ఇంటిని రెండు సార్లు గాలించారు. ఈ సోదాల్లో ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ రావును మచిలీపట్నం మార్కెట్ యార్డ్‌ సమీపంలో కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here