గుడ్‌న్యూస్..ఆరోగ్యశ్రీలో మరో 87 చికిత్సలు

రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేశారు.. మరో ఆరు జిల్లాలకు దీనిని విస్తరించారు. ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు తీసుకువచ్చింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 47 వేల వరకు ఖర్చయ్యే 87 చికిత్సా విధానాలను కొత్తగా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చారు. ఇందులో ఇన్ పేషెంట్‌కు అవసరమయ్యే 53 విధానాలతో పాటు.. 29 స్వల్పకాలిక చికిత్సా విధానాలు, మరో 5 డేకేర్ విధానాలు ఉన్నాయి.

మొత్తం 87 చికిత్సా విధానాల అమలుకు సంబంధించి మార్పు చేసిన ఈ పైలట్ ప్రాజెక్టును ఈనెల 16 నుండి విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని వెల్లడించారు. త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు చేశారు. ఈ ఏడాది జనవరిలో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 జబ్బులకే చికిత్స అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి (మొత్తం 2200) వ్యాధులను చేర్చింది. పైలట్‌ ప్రాజెక్టు అమలు సమయంలో గుర్తించిన అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేశారు.. విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్‌ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here