యుద్ధం శరణం మూవీ రివ్యూ

ముందు నుంచి చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుని సడన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం యుద్ధం శరణం. నాగ చైతన్య, లావణ్య త్రిపాటి జంటగా నటించిన ఈ మూవీపై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. దానికి కారణం పబ్లిసిటీ లోపం అనుకున్నారు కాని అసలు లోపం కంటెంట్ లోనే ఉందని సినిమా చూసి బయటికి వచ్చాక కాని అర్థం కాదు. అలా అని యుద్ధం శరణం మరీ తీసికట్టు బాపతు మూవీ కాదు. ట్రైలర్ నుంచే ఒకరకమైన ఆసక్తి రేపిన ఈ మూవీపై అక్కేనేని ఫాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి యుద్ధం శరణం గెలిచిందా లేక తోక ముడిచి రంగం నుంచి పారిపోయిందా రివ్యూ లో చూద్దాం

డబ్బు కోసం ఎంత దుర్మార్గమైన చేయడానికి వెనుకాడని రకం నాయక్(శ్రీకాంత్). ఇతన్ని అడ్డు పెట్టుకుని హోం మినిస్టర్ తన స్కాములు బయట పడకుండా నగరమంతా బాంబు పేలుళ్లు చేయిస్తాడు. ఆ క్రమంలో ఒక హత్యను చూస్తారు మురళి(రావు రమేష్), లక్ష్మి(రేవతి). దాంతో ఆ ఇద్దరినీ చంపేస్తాడు నాయక్. వీళ్ళ కొడుకే మన హీరో అర్జున్(నాగ చైతన్య). అమ్మ నాన్నను ఎవరు హత్య చేసారు అని తనే స్వయంగా వెతకడం మొదలు పెడతాడు. దీని వల్ల తన అక్క, బావ, చెల్లి, లవర్ అంజలి(లావణ్య త్రిపాటి)అందరు ప్రమాదంలో పడతారు. వాళ్ళను కాపాడుకుంటూ నాయక్ ను చేరుకుంటాడు అర్జున్. తన తల్లి తండ్రుల హత్య కు అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది ఎవరైనా సులభంగా ఊహించే క్లైమాక్స్.

కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించినా కథనం మాత్రం చాలా పాత కాలం నాటిది. అందుకే నాగ చైతన్య, శ్రీకాంత్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంతగా సినిమాకు ఉపయోగాపడలేదు. ఎంచుకునే కథల్లో వెరైటీ ఉండేలా జాగ్రత్త పడుతున్న చైతు ఇక్కడ కూడా పొరపాటు చేయలేదు. కాని అవుట్ పుట్ లో తేడా దర్శకుడి వల్ల వచ్చింది కాబట్టి ఇతగాడిని నిందించడానికి లేదు. తన వరకు బాగా చేసాడు. విలన్ గా మాత్రం శ్రీకాంత్ మరో లైఫ్ పొందాడు. కథలో తన పాత్రలో దమ్ము లేకపోయినా సెకండ్ ఇన్నింగ్స్ కు కావాల్సిన సరుకు తనలో ఏముందో బ్రహ్మాండమైన విలనీ ద్వారా ఇందులో బాగా చూపించాడు శ్రీకాంత్. జగపతి బాబు తో పోటీ పడే క్యాలిబర్ శ్రీకాంత్ లో ఉంది. రావు రమేష్, రేవతి జంట బాగుంది. ఎక్కడా అతి చేయలేదు. హీరో ఫ్రెండ్ గా  ప్రియదర్శి, పోలీస్ ఆఫీసర్ గా మురళి శర్మ. హీరొయిన్ లావణ్య త్రిపాటి చేసింది ప్రత్యేకంగా ఏమి లేదు. అలా అలా చేసుకుంటూ పోయారు తమకు అలవాటైన పాత్రల్లో.

దర్శకుడు కృష్ణ మారి ముత్తు తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వేస్ట్ చేసుకున్నాడు. బలమైన హీరో విలన్ క్లాష్ ని ఇలాంటి కథల్లో వీలైనంత త్వరగా ఎస్టాబ్లిష్ చేయాలి. కాని ఎంత సేపు హీరో ఫ్యామిలీ ఎమోషన్స్, వాళ్ళ మధ్య ఉండే అనుబంధం ఇదంతా సోది వ్యవహారంలా నడిపించడంతో చూస్తోంది యాక్షన్ మూవీ నా లేక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ నా అనిపిస్తుంది. డ్రోన్ ని ఉపయోగించి బ్లడ్ పంపించడం, ఇంటర్వెల్ లో తనను వెంటాడుతున్న విలన్ గ్యాంగ్ ని పోలీసులకు పట్టించడం లాంటి కొన్ని చోట్ల దర్శకుడు తన మార్క్ చూపిస్తాడు కాని కీలకమైన సీక్వెన్స్ లో మాత్రం దారి తప్పి ప్రేక్షకులను పరీక్షిస్తాడు. హీరో విలన్ మైండ్ గేమ్ అన్నప్పుడు దానికి తగ్గ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగాగా రాసుకోవాలి. కాని మారిముత్తు ఇక్కడే దెబ్బ తిన్నాడు. బలమైన నెట్వర్క్ ఉన్న వాడిలా చూపించిన నాయక్ ని హీరో చాలా సులువుగా ఆటాడించడం అంత కన్విన్సింగ్ గా అన్పించదు. వివేక్ సాగర్ మ్యూజిక్ చాలా నాసిరకంగా ఉంది. నికేత్ బొమ్మి కెమెరా పనితనం చాలా వరకు కాపాడింది. పాటలు పెద్దగా లేకుండా సినిమా 2 గంటల పది నిమిషాలే ఉన్నా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎడిటర్ క్రిపారకన్ పనితనం అంతగా మెప్పించదు. అబ్బూరి రవి మాటలు ఒక్కటి కూడా రిజిస్టర్ కావు. వారాహి వారు చాలా లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకుని మరీ తీయటం స్పష్టంగా కనిపిస్తుంది . సినిమా మొత్తం 24 గంటల స్పాన్ లో సిటీ లోనే జరిగినట్టు చూపడంతో భారీ ఖర్చు ఎక్కడా అవసరం పడలేదు

ఫైనల్ గా చెప్పాలంటే యుద్ధం శరణం ఉప్పు వేయటం మరిచిపోయిన ఒక టేస్ట్ లెస్ బిర్యానీ. స్టొరీ మరీ పల్చగా ఉండటం. అసలు కథను పక్కన పెట్టి ఎంతసేపూ ఫ్యామిలీ చుట్టూనే తిప్పడం సహనానికి పరీక్ష పెడుతుంది. కీలకమైన స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చేసిన తప్పులు చూపించిన నిర్లక్ష్యం మంచి మూవీని డిజాస్టర్ గా మారేలా చేసాయి. యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నాం అని లోపలి అడుగు పెడితే కాసేపు లవ్, కాసేపు యాక్షన్, కాసేపు థ్రిల్, కాసేపు ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని కలగలిపి మిక్సీ లో వేసి తిప్పి ఎవరికి రుచించని డ్రింక్ ఇచ్చాడు కృష్ణ మారిముత్తు. మరీ డైరీ ఖాళీగా ఉండి అన్ని సినిమాలు చూసేసి, ఎలా ఉన్నా పర్లేదు తట్టుకునే మానసిక నిబ్బరం ఉంది అనుకుంటే యుద్ధం శరణం మీ కోసమే.

రేటింగ్ : 2/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here