ప్ర‌ధాని మోడీని తీసుకొస్తున్న వై.ఎస్ జ‌గ‌న్‌..?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల‌పై స్పీడ్‌గా ముందుకు వెళుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ మూడు రాజ‌ధానుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఇందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు.

ప‌రిపాల‌న రాజధానిగా విశాఖ‌, శాస‌న‌రాజ‌ధానిగా అమ‌రావ‌తి, న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలును ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఇక వీటిని శంకుస్థాప‌న చేయాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 16వ తేదీన మూడు రాజ‌ధానుల‌కు శంకుస్థాప‌న చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీని ఆయ‌న ఆహ్వానించ‌నున్నారు.

ఈ మేర‌కు పీఎం అపాయింట్‌మెంట్ కోరారు. మూడు రాజ‌ధానుల‌ అంశంతో పాటు పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీ కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్టారు. దీంతో ఈ రెండు కార్య‌క్ర‌మాల‌ను పీఎం చేతుల మీదుగా ప్రారంభించాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఇందుకోసం ప్ర‌ధాని కార్యాల‌యానికి లేఖ రాశారు. ఈ కార్య‌క్ర‌మంలో మోడీ నేరుగా కానీ, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా గానీ పాల్గొనాల‌ని జ‌గ‌న్ కోర‌నున్నారు.

ఈ నెల 16వ తేదీ మంచి ముహూర్తంగా రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇది మిస్ అయితే మ‌ళ్లీ రెండు నెలల త‌ర్వాత కానీ మంచి ముహూర్తం లేద‌న్న‌ట్లుంది. అయితే ఇప్పుడు పీఎం అపాయింట్‌మెంట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. అపాయింట్‌మెంట్ దొర‌గ్గానే సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానితో భేటీ అయ్యి వీటి గురించి పూర్తిగా వివ‌రిస్తారు.

2015లో అప్ప‌ట్లో అమ‌రావ‌తిని రాజధానిగా నిర్ణ‌యించిన నేప‌థ్యంలో శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ వ‌చ్చారు. ఇప్పుడు మళ్లీ మూడు రాజ‌ధానులు ఉండాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీన్ని బ‌ట్టి చూస్తే రాజ‌ధాని ఎంపిక అంశం రాష్ట్రాల ప‌రిధిలో ఉంటుంద‌ని క్లారిటీ ఇస్తూనే.. ప్ర‌ధాని మోడీ కూడా దీనికి అనుకూలంగా ఉన్న‌ట్లు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పొచ్చ‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్లు ఉన్నారు. ఏది ఏమైనా విష‌యంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here