మీరు నాకు ఓటు వేయండి.. మేము మీకు వ్యాక్సిన్ ఇస్తాం..

దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీ అవ‌లంభిస్తున్న విధానాలు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. బీహార్ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో బీజేపీ తీసుకొచ్చిన క‌రోనా వ్యాక్సిన్ అంశం ఇప్పుడు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఎన్నిక‌ల్లో గెలిపించ‌క‌పోతే వ్యాక్సిన్ వెయ్య‌రా అంటూ రాజ‌కీయ పార్టీలు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి.

ఎన్డీఏ మళ్లీ అధికారంలోకొస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తామని బిహార్‌ ప్రజలకు బీజేపీ హామీ ఇచ్చింది. విజన్‌ డాక్యుమెంట్‌ పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కరోనాపై పోరులో భారత్‌ ముందు వ‌రుస‌లో ఉంద‌న్నారు. మూడు వ్యాక్సిన్లు ప్రయోగ పరీక్షల దశలో ఉన్నాయన్నారు. ఐసీఎంఆర్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను బిహార్‌ ప్రజానీకానికి అందుబాటులో ఉంచుతామ‌ని.. ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. దీనిపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ వ్యంగాస్త్రాలు సంధించారు. మీరు నాకు ర‌క్తానివ్వండి.. నేను మీకు స్వాతంత్రం ఇస్తా అన్న‌ది అప్ప‌టి నినాద‌మ‌ని.. ఇప్పుడు మీరు నాకు ఓటు వేయండి. మేము మీకు వ్యాక్సిన్ ఇస్తామ‌న్న‌ది ఇప్ప‌టి మాట అంటూ ఆయ‌న వ్యంగంగా స్పందించారు.

బీజేపీకి ఓటువేసే వారికి మాత్రమే వ్యాక్సిన్. బీజేపీ చూపిస్తున్న వివక్షతకు ఇదే నిదర్శనమ‌న్నారు. బీజేపీ స్వ‌భావం ఇదే అంటూ ఆయ‌న మండిప‌డ్డారు. అయితే అత్యంత కీలకమైన ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని ఓ రాజకీయ పార్టీ ప్రకటించడం ఇదే ప్రథమం. మొత్తానికి బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో క‌రోనా వ్యాక్సిన్ చేర్చ‌డం వివాదంగానే చెప్పుకుంటున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోతే వ్యాక్సిన్ ఇవ్వ‌రా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మ‌రి బీజేపీ దీనిపై ఏ విధంగా మాట్లాడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here