రాజకీయాల్లోకి నారా రోహిత్‌..?

నారా చంద్రబాబు నాయుడి సోదరుడి కుమారుడిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు నారా వారి అబ్బాయి రోహిత్‌. మొదటి నుంచి సినిమా ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రోహిత్‌. ఇదిలా ఉంటే ఈ యంగ్‌ హీరో రాజకీయాల్లోకి రానున్నాడనే ఓ వార్త ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ వార్తలు రావడానికి కారణంలేకపోలేదు.. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌2న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో తలసీమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్‌ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కొంతమంది యువనాయకులు కూడా ఈ వివరాల్ని తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ప్రజలకు తెలియజేశారు.

ఇక ఇదే విషయాన్ని హీరో నారా రోహిత్‌ కూడా చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై రోహిత్‌ మాట్లాడుతూ.. ‘హాయ్.. నేను మీ నారా రోహిత్. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు.. తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మన తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ క్యాంప్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో నారా రోహిత్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే చర్చ సోషల్‌ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఇంకో అడుగు ముందుకేసి.. నారా రోహిత్‌కు తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here