తిరుప‌తి ఉప ఎన్నిక‌లో టిడిపి ఎందుకు పోటీ చేస్తుంది..

ఏపీలో ఉప ఎన్నిక స‌మ‌రానికి రాజ‌కీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో తిరుపతి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఇప్పటికే తిరుపతిలో తమ సత్తా చాటుతామంటూ బీజేపీ ప్రకటించింది. దుబ్బాకలో గెలిచినట్టుగా తిరుపతిలో కూడా గెలుస్తామంటూ ఏపీ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబానికే టికెట్ ఇస్తుందా లేక వేరే అభ్యర్థిని నిలబెడుతుందా అనేది త్వరలో తేలనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్‌‌సభ ఉప ఎన్నికకు ముందుగానే టీడీపీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వెల్లడించారు.

2019 ఎన్నికల్లో పనబాక లక్ష్మీ టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కాగా తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌లో నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో లోక్‌సభ మండలాల వారీగా కమిటీలు, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా ఏడుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు నియామకం చేశారు. తక్షణం కమిటీలు పని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా తిరుప‌తి ఉప ఎన్నికలో మొద‌ట బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని టిడిపి యోచించిన‌ట్లు స‌మాచారం బ‌య‌ట‌కు లీకైంది.

టిడిపి అభ్య‌ర్థిని బ‌రిలో దింప‌కుండా బీజేపికి స‌పోర్టు చేసి మ‌చ్చిక చేసుకోవాల‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యూహం ప‌న్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డిచింది. అయితే ఏమైందో కానీ మ‌ళ్లీ టిడిపి పోటీ చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కాగా ప్ర‌జా ప్ర‌తినిధి చ‌నిపోతే ఆ స్థానంలో అదే పార్టీకి చెందిన నాయ‌కుడినే ఏక‌గ్రీవంగా ఎన్నుకునే సాంప్ర‌దాయం ఉంది. దీన్ని వ్య‌తిరేకిస్తూ ఇప్పుడు ఇత‌ర పార్టీలు సైతం అభ్య‌ర్థిని పోటీలో దింప‌డానికి సిద్ద‌మ‌య్యాయి. మ‌రి ఈ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు ఏ విధంగా స్పందిస్తారో అన్న‌ది ఆస‌క్తిగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here