బీహార్ ముఖ్య‌మంత్రిపై సెటైర్లు..

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బీహార్ ఎన్నిక‌ల క‌థ ముగిసిపోయింది. సీఎంగా నితీష్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు డిప్యూటీసీఎంలు, మంత్రులు కూడా రెడీ అయిపోయారు. అయితే ప్ర‌భుత్వ ఏర్పాటులో అధికార పార్టీ బిజీగా ఉంటే.. ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టి నుంచే సెటైర్లు స్టార్ట్ చేశాయి.

బీహార్ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 125 సీట్లను దక్కించుకున్న విష‌యం తెలిసిందే. బీజేపీ 73, జేడీయూ 43 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కంటే చాలా త‌క్కువ సీట్లు జేడీయూ గెలుచుకుంది. దీంతో ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జేడీయూ నేత నితీష్ కుమార్ సీఎం అవుతారా అన్న సందిగ్ద‌త నెల‌కొంది. అయితే ముందుగా అనుకున్న మాదిరిగానే ఎన్డీయే త‌రుపున నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రిగానే ఉంటార‌ని బీజేపీ చెప్పింది. ఇప్పుడు ప్ర‌మాణ స్వీకారం కూడా చేశారు. అయితే నితీష్ సీఎం అవ్వ‌డంపై ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి.

బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ నేత, ప్రతిపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన గౌరవ నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు’ అని హిందీలో ట్వీట్ చేశారు. కుర్చీ ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు, బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు తేజస్వి పేర్కొన్నారు. అలాగే, ఎన్డీయే హామీ ఇచ్చిన 19 లక్షల ఉద్యోగాలు, విద్య, మందులు, ఉపాధి, నీటిపారుదల వంటి సమస్యలను పరిష్కరిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.

ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కూడా ట్విటర్‌ ద్వారా నితీశ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. అయితే చిరాగ్ ట్వీట్‌లో నితీశ్‌కు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఓ రహస్య సందేశం ఉందంటూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నితీశ్‌ స్వయంగా ముఖ్యమంత్రి కాలేదని, బీజేపీనే ఆయనను సీఎంగా కూర్చోబెట్టిందనే ఉద్దేశంలో ఆ ట్వీట్ ఉన్నట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. చిరాగ్ ఏమ‌న్నారంటే.. నితీశ్ కుమార్ గారూ.. మళ్లీ ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్నందుకు శుభాకాంక్షలు. సీఎం అయినందుకు మీకు, మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టినందుకు బీజేపీకి శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు.

ఇక నితీష్ గురించి ఆ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సెటైర్లు విసిరారు. నితీష్‌కు శుభాకాంక్షలు చెబుతూనే ప్రజలు మరికొన్ని ఏళ్లు నితీష్‌ను భరించక తప్పదని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే జేడీయూ-బీజేపీ మధ్య సీట్ల పంపకాల విషయంలో ప్రశాంత్ కిషోర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి 50 శాతం సీట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని, ఒకానొక సందర్భంలో బీజేపీతో పొత్తే అవసరం లేదని పట్టు పట్టారు. అనంతరం ఇద్దరి మధ్యా పెరిగిన విబేధాల కారణంగా ప్రశాంత్‌ను తొలగిస్తూ నితీష్‌ కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. నితీష్ ప్రభుత్వ తప్పిదాలపై బిహార్ యువతను ఏకం చేస్తానని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. అయితే జేడీయూ నుంచి బయటకు వెళ్లిన కొద్ది రోజుల తర్వాత నుంచి బిహార్ రాజకీయాల్లో పీకే కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్నప్పటికీ ఆయన ఎక్కడా కనిపించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here