మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై బీజేపీ నేత‌లు ఎందుకు స్పందించ‌రూ..?

ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేస్తామ‌ని చెప్పుకునే ప్ర‌జాప్ర‌తినిధులకు దేశంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు క‌నిపించ‌డం లేదా అన్న ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే స్పందించి రాజ‌కీయాలు చేసే నాయ‌కులు మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాల‌పై ఎందుకు స్పందించ‌ర‌న్న వాద‌న ఎక్కువ‌వుతోంది. అభివృద్ధి లేక‌పోయినా జీవితం కొన‌సాగించొచ్చు కానీ.. ర‌క్ష‌ణ లేని స‌మాజంలో జీవించ‌డ‌మే బార‌మ‌ని ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌థ్రాస్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై దేశం ర‌గిలిపోతోంది. ప్ర‌జ‌ల ఆగ్ర‌హ జ్వాల‌ల‌తో యూపీ అట్టుడుకిపోతోంది. ఇది మ‌రువ‌క ముందే మరో ఘ‌ట‌న మ‌హిళ‌ల్ని కోలుకోలేకుండా చేస్తోంది. ఇన్ని జ‌రుగుతున్న రాజ‌కీయ నాయ‌కుల‌కు రాజ‌కీయాల కంటే ఇంకేం వ‌ద్ద‌న్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అయితే ఇక్క‌డ ఆలోచించాల్సిన అతి ముఖ్య‌మైన విష‌యం ఒక‌టుంది. ఏమిటంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్టే రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు వ‌స్తే ఎందుకు స్పందించ‌వ‌ని అంతా ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎక్క‌డో ఉన్న మోడీపై కామెంట్ చేస్తే ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న బీజేపీ శ్రేణులు మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై మోదీకెందుకు ఫిర్యాదు చెయ్య‌ర‌న్న అనుమానాలు ఎక్కువ‌వుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే ప‌రిస్ఙ‌తి ఏర్పడింది. అయితే ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన చ‌ట్టాల్లాంటివి ఎన్ని తీసుకొచ్చినా ఇంకా మ‌నుషులు మృగాళ్ల‌లాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. యూపీలో జ‌రిగిన ఘ‌ట‌న‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఘ‌ట‌న నుంచి కోలుకునేలోపే మ‌రో ఘ‌ట‌న జ‌రుగుతున్న రాష్ట్రంలో ప‌రిపాల‌న ఏ విధంగా జ‌రుగుతుందోన‌న్న భ‌యాన‌క ప‌రిస్థితి నెల‌కొంది.

దేశంలో భారీ మెజార్టీతో సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ నేత‌లే దీనికి స‌మాధానం చెప్పాలన్న వాద‌న ఎక్కువైంది. ఎందుకంటే పార్ల‌మెంటులో ఏం చేయాలో ఏం చేయ‌కూడ‌దో డిసైడ్ చేసే ప‌రిస్థితిలో ఇప్పుడు బీజేపీ ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా బీజేపీ నేత‌లు ఇప్ప‌టికైనా దీని గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఓట్ల కోసం మారుమూల ప్రాంతం నుంచి హైటెక్ సిటీ వ‌ర‌కు అంద‌రినీ క‌వ‌ర్ చేస్తున్న ప్ర‌జాప్ర‌తినిధులు గ్రామాల్లో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో గ‌మ‌నించడం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆందోళ‌న‌లు చేయాలంటే రాష్ట్రం మొత్తం కార్య‌క‌ర్త‌లు సిద్దం కావాల‌ని చెప్పుకునే రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌ను అన్ని విదాలా చైత‌న్యం క‌ల్పించ‌డంలో ఎందుకు విఫ‌లం అవుతున్నాయో ప్ర‌శ్నించుకోవాలి.

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌నలు ఒక్క‌సారి ప‌రిశీలిస్తే ఏపీలో ఆల‌యాల‌పై దాడులు ఎక్కువ‌య్యాయి. ప్ర‌ధానంగా హిందూ దేవాల‌యాల‌ను టార్గెట్ చేసిన దుండ‌గులు ధ్వంసం చేస్తున్నారు. దీన్ని ప్ర‌జ‌లంద‌రూ వ్య‌తిరేకిస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు దీన్ని క్యాష్ చేసుకొని రాజ‌కీయాలు చేస్తున్నారు. అయితే ఆ త‌ర్వాత వెంట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యువ‌తిపై అత్యాచార ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చి దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆల‌యాల‌పై దాడుల‌కు ఆందోళ‌న‌లు చేసి అరెస్టుల‌కు సిద్ధ‌మైన నేత‌లు.. మ‌హిళ‌ల‌పై దాడుల విష‌యంలో ఆందోళ‌న‌లు చేసి తాము అండ‌గా ఉన్నామ‌ని చెప్ప‌డంలో ఎందుకు ముందుకు రావ‌డం లేదో వారికే తెలియాలి. యూపీలో ఇన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే బీజేపీ నేత‌లు ఎందుకు సీఎం యోగిపై ఆందోళ‌న‌లు చేయ‌డం లేదు. సీఎం త‌మ పార్టీ వారేన‌న్న కార‌ణ‌మే అడ్డొచ్చిందా అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఆల‌యాలు, విగ్ర‌హాల‌పై దాడుల‌కు ఇస్తున్న ప్రాముఖ్య‌త మ‌హిళ‌ల మాన‌, ప్రాణాల‌కు బీజేపీ ఇవ్వ‌డం లేదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో ఎన్నో చారిత్రాత్మ‌క బిల్లులు తీసుకొచ్చిన బీజేపీ స‌ర్కార్ మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో క‌ఠిన చ‌ట్టాలు చేయాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ పార్టీ ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉన్న రాష్ట్రంలో ప్ర‌తి దానికీ ఊగిపోయే నేత‌లు… కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది త‌మ పార్టీనేన‌న్న విష‌యాన్ని గుర్తెరిగి చ‌ట్టాల్లో మార్పులు చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here