ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం కేంద్ర ప్ర‌భుత్వం విష‌యంలో ఎందుక‌లా మాట్లాడారు..

ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రికి కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా మేధావులు పేర్కొంటున్నారు. ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కారుపై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో న‌డ్డా బెంగాల్ రాష్ట్రంలోనే ప‌ర్య‌టించారు.

ఈ విష‌యంలో కూడా రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కార్‌కు వివాదం ఇంకా ముదిరింద‌ని చెప్పొచ్చు. అదంతా ప‌క్క‌న పెడితే తాజాగా కేంద్ర హోం శాఖ రాష్ట్రానికి ఓ లేఖ రాసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, డీజీపీకి పంపిన లేఖలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సెంట్రల్ డిప్యూటేషన్‌కు పంపించాలని ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఐపీఎస్ కేడర్ రూల్స్‌లోని సెక్షన్ 6(1) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై అంగీకారం కుదరకపోతే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే అమలవుతుందని తెలిపింది. ఐపీఎస్ అధికారులు భోలానాథ్ పాండే, రాజీవ్ మిశ్రా, ప్రవీణ్ త్రిపాఠీలను సెంట్రల్ డిప్యూటేషన్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసింది. భోలానాథ్ పాండేను బీపీఆర్‌డీ ఎస్‌పీగానూ, ప్రవీణ్ త్రిపాఠీని ఎస్ఎస్‌బీ డీఐజీగానూ, రాజీవ్ మిశ్రాను ఐటీబీపీ ఐజీగానూ నియమించింది.

దీనిపై మమత బెనర్జీ స్పందిస్తూ వరుస ట్వీట్లలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్య రాష్ట్ర పరిథిని అతిక్రమించే ఉద్దేశపూర్వక ప్రయత్నమని ఆరోపించారు. రాష్ట్రంలో పని చేస్తున్న అధికారుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ చర్య సమాఖ్య నిర్మాణ మౌలిక లక్షణాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అనామోదయోగ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర యంత్రాంగాన్ని పరోక్షంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అనుమతించేది లేదన్నారు. సామ్రాజ్యవాద, అప్రజాస్వామిక శక్తుల ముందు పశ్చిమ బెంగాల్ మోకరిల్లబోదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here