రాష్ట్రంలో అమ‌ల‌వుతోంది ఐపిసి సెక్ష‌న్లా.. లేదా వైసీపీ సెక్ష‌న్లా..

ఏపీలో రాజ‌ధాని రైతుల‌కు పోలీసులు బేడీలు వేయ‌డం వివాదాస్ప‌దం అవుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ అంశంలో పోరాడేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. నేడు గుంటూరు జైలు కార్య‌క్ర‌మానికి రాజ‌ధాని నేత‌లు పిలుపునివ్వ‌డం ఆందోళ‌న‌ల‌కు దారి తీస్తోంది.

కృష్ణాయపాలెం ఎస్సీ, బీసీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, వారికి సంకెళ్ళు వేసి జైలుకు తరలించడంపై రాజధాని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్‌లకు వ్యతిరేకంగా రాజధాని జేఏసీ నేతలు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతులకు బేడీలు వేయడానికి నిరసగా నేడు ఛలో గుంటూరు జైలు కార్యక్రమానికి రాజధాని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ ఇన్‌చార్జ్‌లు కోవెలమూడి రవీంద్ర, నసీర్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుపై నేతలుు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాదు, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయ‌ని ఏపీ టిడిపి అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజధానికి వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టి.. వైసీపీ నేతలు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని అచ్చెన్నాయుడు సూచించారు. కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసి రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి మిగిలిపోయారని అన్నారు. గుంటూరు జైల్‌ భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయని అచ్చెన్న తెలిపారు. జైల్‌ భరోకు వెళ్తున్న వారిని హౌస్‌ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రైతు రాజ్యం అంటే ప్రశ్నించిన రైతులకు బేడీలు వేయడమా అని ప్ర‌శ్నించారు. తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని ఏం చేయాలో అర్థంకాక.. రైతులపై పగ, ప్రతీకారాలకు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here