ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయో..?

అన్‌లాక్‌లో అన్ని ర‌కాల ప‌నులు జ‌రుగుతున్నా ఆర్టీసీ బ‌స్సుల విష‌యంలో మాత్రం ముంద‌డుగు ప‌డ‌టం లేదు. ఇప్ప‌టికే రెండు సార్లు స‌మావేశ‌మైన ఏపీ, తెలంగాణ అధికారులు దీనిపై ఓ క్లారిటీకి రాలేక‌పోయారు. ఫ‌లితంగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య‌ ఆర్టీసీ బ‌స్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఏపీ, తెలంగాణా ఆర్టీసీ బ‌స్సులు ఆయా రాష్ట్రాల ప‌రిధిలో బ‌స్సుల‌ను న‌డుపుతూనే ఉన్నాయి. అయితే కేంద్రం అంతరాష్ట్ర స‌ర్వీసులు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పినా ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సులు ఇంకా తిర‌గ‌డం లేదు. కార‌ణం ఇరు రాష్ట్రాల మ‌ధ్య అంగీకారం కుద‌ర‌క‌పోవ‌డ‌మే అని తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు సార్లు అధికారులు స‌మావేశ‌మై బ‌స్సులు తిప్పేందుకు చ‌ర్చించినా ఇంకా కొలిక్కి రాలేదు. ఈ స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో అర్థం కావ‌డం లేదు.

ఏపీ నుంచి తెలంగాణాకు వేలాది మంది ప్ర‌జ‌లు వెళుతుంటారు. వీరికంతా నేరుగా బ‌స్సులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఆర్టీసీ బ‌స్సులు లేక‌పోవడం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేవారు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఈ నెల 15వ తేదీన జ‌రిగిన స‌మావేశంలోనైనా బ‌స్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాలు అనుమ‌తులు ఇస్తాయ‌ని అనుకున్నా జ‌ర‌గ‌లేదు.

స‌మాన కిలోమీట‌ర్లు బ‌స్సులు న‌డిపేందుకు ముందుకు వ‌స్తే తాము సిద్దంగా ఉన్నామ‌ని తెలంగాణ ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శ‌ర్మ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక కిలోమీట‌ర్లు త‌గ్గించుకుంటే ఇరు రాష్ట్రాల‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణ‌బాబు తెలిపారు. ఇక ఏకాభిప్రాయం కుదిరేవ‌ర‌కు తాత్కాలికంగా బ‌స్సులు న‌డుపుదామ‌ని ప్ర‌తిపాదించ‌గా.. తెలంగాణ అందుకు అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం. మొత్తానికి మ‌రో రెండు రోజుల్లో మ‌రోసారి ఏపీ తెలంగాణ అధికారులు స‌మావేశం అవ్వ‌నున్నారు. మ‌రి ఈ స‌మావేశంలోనైనా ఏకాభిప్రాయం వ‌స్తోందో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here