క‌రోనా వ్యాక్సిన్ మాకు వ‌ద్దు..

ప్ర‌పంచంలో క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు మాత్రం ఎక్కువ‌గానే ఉంది. అయితే దేశంలో ఎంత మంది క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారో అని ఓ స‌ర్వే జ‌రిగింది.

ఒక ఆన్‌లైన్ సర్వేలో 70.4 శాతం మంది టీకా వేయించుకునేందుకు సిద్ధం కాగా, 29.6 శాతం మంది టీకాపై అంత ఆసక్తి చూపించడం లేదు. ఈ అధ్యయనాన్ని ఎపిడెమియోలజీ జర్నల్ తన రాబోయే సంచికలో ప్రచురించనుంది. దేశంలోని మొత్తం 467 మంది నుంచి ఆన్‌లైన్ సర్వే ద్వారా వివిధ అంశాలు సేకరించిన వర్థమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ విభాగం హెడ్ ప్రొఫెసర్ జుగల్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. కరోనా టీకా వేయించుకోవడంపై పలువురిని ప్రశ్నించామన్నారు. 70.4 శాతం మంది టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపగా, 29.6 శాతం మంది టీకా అంత సురక్షితం కాదేమోననే అనుమానాలు వ్యక్తంచేస్తూ, టీకా వేయించుకునేందుకు అనాసక్తి చూపారు. 54.7 శాతం మంది టీకా సురక్షితమా? కాదా అనేది తమకు తెలియదన్నారు.

పిల్లలకు టీకా వేయించడంలో 63.2 శాతం మంది ముందుకు వస్తుండగా, 6.9 శాతం మంది ఈ టీకా పిల్లలకు సురక్షితం కాదేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. 30 శాతం మంది సందిగ్ధంలో ఉన్నారు. టీకా వేయించుకున్నాక కరోనా రాదని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా 49.5 శాతం మంది అవునని చెప్పగా, 11.1 శాతం మంది సందేహాస్పదమేనని అన్నారు. కాగా ఈ సర్వేలో పాల్గొన్న 59.3 శాతం మంది… ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇవ్వాలని కోరుకుంటుండగా, 6.2 శాతం మంది ఉచితంగా ఇవ్వకూడదన్నారు. పేదలకు ఉచితంగా టీకా ఇవ్వాలని 34.5 శాతం మంది కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here