ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య మాట‌ల యుద్ధం..

బీహార్ ఎన్నిక‌లు ఇద్ద‌రు సీఎంల మ‌ధ్య మాట‌ల యుద్దానికి దారితీశాయి. బీహార్ ముఖ్య‌మంత్రి నితిష్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌లు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడులు చేసుకున్నారు. బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇది చోటుచేసుకుంది. కాగా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల్లో ఏ ఒక్క‌రూ పేరు ప్ర‌స్తావించ‌కుండానే మాట్లాడారు.

సీఎం నితీశ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ ఎన్నిక‌ల వేదిక‌గా విమర్శలు గుప్పించుకున్నారు. సీఏఏ విషయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. చొరబాటు దారు సమస్యకు ప్రధాని మోదీ ఓ పరిష్కారాన్ని కనుగొన్నారని చెప్పారు. సీఏఏ ద్వారా పాక్, అఫ్గనిస్తాన్, బంగ్లాలో హింసకు గురవుతున్న మైనారిటీల భద్రతకు ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. దేశభద్రతకు తూట్లు పొడచడానికి ప్రయత్నించిన ఏ చొరబాటుదారుడినైనా బయటికి పంపిస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.

అనంత‌రం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. అయితే యోగి పేరు ప్ర‌స్తావించ‌కుండా నితీష్ మాట్లాడారు. ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు చెప్పారని..? ఇంతటి హానికరమైన ప్రచారాన్ని ఎవరు చేశారని..? ప్రజల్ని ఎవరు బయటికి పంపించేస్తారని..? ఇంతటి సాహసం ఎవరూ చేయలేరన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దేశానికి చెందిన వారే. ప్రతి ఒక్కరూ భారతీయులే అన్నారు. ఐకమత్యం, సోదరభావంతో కలిసి పనిచేయడం వల్లే అభివృద్ధి సాధ్యం అన్నారు. దేశంలో విభజన తీసుకురావడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. ఇద్ద‌రు సీఎంల వ్యాఖ్య‌లు ఇలా ఉండ‌టం ప‌ట్ల నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here