87 ఏళ్ల జీవితంలో మొద‌టి సారి ఓటు వేశారు..

దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేస్తుంటారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా ఎక్క‌డి నుంచైనా సొంత ప్రాంతాల‌కు వ‌చ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాంటిది ఓ వృద్ద దంప‌తులు కొన్ని ద‌శాబ్దాలుగా ఓటు వేయ‌లేదు. చివ‌ర‌కు ఇప్పుడు వారి కోరిక నెర‌వేర‌డంతో ఆనందంతో చేతికి అంటించిన గుర్తుల‌ను చూసుకుంటున్నారు. ఇప్పుడీ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

జమ్ములో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(డీడీసీ) మూడవ దశ ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత… తమ వేళ్లపై పెట్టిన గుర్తులను అపురూపంగా చూసుకుంటూ 87 ఏళ్ల లాల్ చంద్, అతని భార్య త్రివితా(82) కంటనీరు పెట్టుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఓటు వేయాలన్న తమ కోరిక ఇప్పుడు నెరవేందని వారు తెలిపారు. లాల్ చంద్, అతని భార్య త్రివితా పాకిస్తాన్ శరణార్థులు. వారు 1947లో విభజన సమయంలో భారత్ వచ్చారు.

గత ఏడాది ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ ప్రాంతంలోని సుమారు 1.50 లక్షల మందికి కొత్తగా జమ్ముకశ్మీర్ స్థానిక ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లభించింది. 1947లో 14 ఏళ్ల వయసులో పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన లాల్‌చంద్ మాట్లాడుతూ తాను జీవితంలో తొలిసారి ఓటు వేశానని, దీంతో తన చివరి కోరిక నెరవేరినట్లయ్యిందని అన్నారు. పాకిస్తాన్ శరణార్థి యాక్షన్ కమిటీ అధ్యక్షుడు లాబా రామ్ గాంధీ మాట్లాడుతూ తమకు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఏడు దశాబ్ధాల తరువాత తమకు స్వాతంత్ర్యం వచ్చినట్లున్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here