ప్రధాని అవ్వాలని ఉందా అంటే వెంకయ్య ఇలా అన్నారు ..

భారత ప్రధాని కావాలనే కోరిక తనకు లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆ అర్హత కూడా తనకు లేదని ఆయన అన్నారు. 2017 తన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. అమరావతికి విచ్చేసిన వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, ఈ విధంగా స్పందించారు. తన పరిధిలో ఇరు తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. దేశంపై క్యాష్, క్యాస్ట్, కమ్యూనిటీ ప్రభావం ఉండటం మంచిది కాదని అన్నారు. కులాల గురించి ఎవరు కూడా ఎక్కువ ఆలోచించవద్దని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడానని వెంకయ్య తెలిపారు. అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణం పరిపాలనా సౌలభ్యంగా ఉండాలని చెప్పారు. భవనాల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.

పార్టీ ఫిరాయింపులు మంచి సంప్రదాయం కాదని ఉప రాష్ట్రపతి తెలిపారు. ఫిరాయింపులపై ఫిర్యాదులు వస్తే, మూడు నెలల్లో పరిష్కరించాలని అన్నారు. ఫిరాయింపులపై తాను కొత్త ఒరవడిని సృష్టించానని చెప్పారు. చట్టసభల్లో ప్రజాపతినిధులు పైచేయి సాధించాలంటే… భుజ బలం కాదని, బుద్ధి బలం ఉండాలని తెలిపారు. అధికార, ప్రతిపక్షాలు శత్రువులు కాదని చెప్పారు. చట్ట సభలను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని… చట్ట సభల్లో నిరసన తెలపడానికి వాకౌట్ల వంటి మార్గాలు ఉన్నాయని తెలిపారు. వివాదాలతో పత్రికల్లో పతాక శీర్షికలు వస్తాయే తప్ప, పతకాలు రావని నవ్వుతూ అన్నారు. పార్టీలు తీసుకునే నిర్ణయాలపై తాను కామెంట్ చేయనని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here