ల‌వ్ జీహాద్‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం సంచ‌ల‌న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. లవ్ జీహాద్’ నిరోధక ఆర్డినెన్స్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతపు, నిజాయితీ లేని మత మార్పిడులను నిరోధించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం ఆమోదం తెలిపారు.

యువతుల బలవంతపు మత మార్పిడిని నిరోధించాలన్న లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. చట్టవిరుద్ధ మతమార్పిడులు, మతాంతర వివాహాలను నిరోధించడమే ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. యువతిని ఒక మతం నుంచి వేరొక మతంలోకి మార్చాలన్న ఏకైక లక్ష్యంతో వివాహం చేసుకుంటే, ఆ పెళ్లి చెల్లనిది అవుతుందని ఈ ఆర్డినెన్స్ చెప్తోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా మత మార్పిడికి పాల్పడినవారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చు. నిర్బంధించి, దురాగతాలు లేదా మోసాల ద్వారా మతం మార్చినట్లు నిర్థరణ అయితే, అది నాన్ బెయిలబుల్ నేరం అవుతుంది.

ఉత్తర ప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడుల నిషేధ ఆర్డినెన్స్, 2020 పేరుతో ఈ రాజశాసనం అమల్లోకి వచ్చింది. వక్రీకరణ, నిర్బంధం, మోసం, అనుచిత ప్రభావం, బలప్రయోగం, ప్రలోభం వంటివాటికి గురి చేసి లేదా పెళ్లి పేరుతో ఒక మతం నుంచి మరొక మతానికి వ్యక్తులను మార్చడం ఈ ఆర్డినెన్స్ ప్రకారం నేరం. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, మధ్య ప్రదేశ్ కూడా ఇటువంటి చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ చర్యలను ఖండించాయి. వ్యక్తిగత స్వేచ్ఛను అతిక్రమించడమేనని ఆరోపించాయి. దేశంలో మతపరమైన విభజనను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఈ విషయమై ప్రభుత్వానికి పలు చురకలు అంటించారు. ‘దీనికి బదులు..వ్యవసాయోత్పత్తుల సేకరణ కోసం, యువత ఉద్యోగాల కోసం ఆర్డినెన్స్ ఎందుకు తేరు’ అని ఆయన ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here