రాబోయే పండుగ‌ల‌పై కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు..

క‌రోనా విజృంభిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాబోయే పండుగ‌లు ఎంతో కీల‌కం. క‌రోనా లాక్ డౌన్ నుంచి వ‌చ్చిన అన్ని పండుగ‌ల‌ను ప్ర‌జ‌లంతా బౌతిక దూరం పాటిస్తూనే జ‌రుపుకున్నారు. దీంతో రానున్న పండుగ‌ల‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు 70 లక్షలు దాటాయి. 60 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా లక్ష మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పండుగ‌ల‌ను పుర‌ష్క‌రించుకొని ప్ర‌జ‌లు గుమికూడ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. భగవంతుడి పట్ల, మతం పట్ల మీ విశ్వాసం నిరూపించుకునేందుకు పెద్దసంఖ్యలో ఒకేచోట గుమికూడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో మనం ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. ప్రార్థనలు చేసేందుకు విధిగా ఆలయాలు, మసీదులు సందర్శించాలని ఏ దేవుడూ, మతం చెప్పలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

పండుగలు జరుపుకునేందుకు మన జీవితాలను పణంగా పెడతామా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌రోనాను అరికట్టేందుకు భార‌త్ అలుపెరుగ‌ని పోరాటం చేస్తోంద‌న్నారు. వైర‌స్‌ను క‌ట్ట‌డిచేసేందుకు బౌతిక‌దూరం పాటించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో జన్‌ ఆందోళన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారన్నారు. కాగా ద‌స‌రా, దీపావ‌ళి పండుగల నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా సంబ‌రాలు చేసుకునేందుకు పెద్ద సంఖ్య‌లో గుమిగూడే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ ఇంకా రావ‌డానికి చాలా టైం ప‌ట్టే అవ‌కాశం ఉంది. దీంతో ప్రభుత్వ మార్గద‌ర్శ‌కాలు ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here