కేంద్ర మంత్రి రాజీనామా.. ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధానాల‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ రాజీనామా చేసి సంచ‌ల‌నం సృష్టించారు. మోడీ స‌ర్కార్ రైతు ఉత్ప‌త్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతుల ధ‌ర‌ల హామీ, సేవ‌ల ఒప్పంద బిల్లులు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ బిల్లుల‌ను ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకించ‌గా.. మిత్ర‌ప‌క్ష‌మైన అకాలీద‌ళ్ కూడా వ్య‌తిరేకించి ఆ పార్టీ నుంచి మంత్రి ప‌ద‌వి తీసుకున్న హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ రాజీనామా చేశారు.

కాగా కేంద్ర మంత్రి రాజీనామా చేసినా మోదీ ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సవరణ బిల్లుతో రైతులకు మినహాయింపు లభిస్తుందని, మధ్యవర్తులు, దళారుల పీడ విరగడ అవుతుందని మోదీ అన్నారు. ఇలా రైతులకు మేలు జరగడం, కొత్త కొత్త అవకాశాలు రావడం కొంత మందికి నచ్చడం లేదని కాంగ్రెస్ స‌హా విపక్షాలపై మోడీ పరోక్షంగా మండిపడ్డారు.

ద‌శాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీలు బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని మోడీ ఆరోపించారు. రైతుల‌కు సంబంధించిన ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తున్నాయ‌ని తెలిపారు. బిల్లుల ద్వారా కనీస మద్దతు ధర లభించదని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని తప్పుడు విమర్శలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా ఇన్నాళ్లూ ఎన్‌.డి.ఏ స‌ర్కారులో భాగ‌మైన అకాలీద‌ళ్ కేంద్ర మంత్రి వర్గం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో దేశ వ్యాప్తంగా మోదీ స‌ర్కారు విష‌యంలో కూడా వ్య‌తిరేక‌త వ‌స్తోందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే అకాలీద‌ళ్ కేవ‌లం మంత్రి వ‌ర్గం నుంచే కాకుండా  ఎన్‌.డి.ఏ నుంచి కూడా త‌ప్పుకుంటుందా అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here