డ‌బ్బులు ఇవ్వాల‌ని మ‌హిళా ఎమ్మెల్యేకు బెదిరింపులు..

దేశంలో సామాన్యుల నుంచి ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు అంద‌రికీ బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన దుండ‌గుడు డ‌బ్బులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. బీహార్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

నర్కటియాగంజ్ బీజేపీ ఎమ్మెల్యే రష్మీవర్మకు ఫోన్ చేసిన దుండగుడు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్‌పై ఆమె మేనేజర్ మథురసింగ్ షికార్‌పూర్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోన్ నంబరు ఆధారంగా నిందితుడిని మహేశ్‌పూర్‌కు చెందిన మున్నాఖాన్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడని, అతడిని పలుమార్లు ప్రశ్నించినప్పటికీ పెదవి విప్పడం లేదని నర్కటియాగంజ్ ఎస్‌డీపీవో కుందన్ కుమార్ తెలిపారు.

ఎమ్మెల్యే రష్మీవర్మ గోరఖ్‌పూర్ నుంచి పాట్నా వెళ్తున్నప్పుడు నిందితుడు ఫోన్ చేశాడని మథురసింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు రూ. 25 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా ఎమ్మెల్యేను దుర్భాషలాడాడని పేర్కొన్నారు. నిందితుడి కాల్ రికార్డు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్టు కుందన్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఇటీవ‌ల గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కూడా ఈ మేర‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఓ వ్య‌క్తి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ మెసేజులు పంపించాడు. దీనిపై సీఎం ప్రమోద్ సావంత్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను బెదిరిస్తూ సందేశాలు పంపిన యువకుడిని గోవా పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here