ప్ర‌భుత్వ అధికారుల అవినీతిపై గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ప్ర‌భుత్వ అధికారులు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు మాట్లాడ‌టం మ‌నం వార్త‌ల్లో చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఓ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాష్ట్రంలోని అధికారుల‌పై మాట్లాడ‌టం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈయ‌నే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్.

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ల ద్వారా త‌న అభిప్రాయాలు వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్ కొద్ది కాలంగా పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. గతంలో మమత బెనర్జీ మాట్లాడుతూ, గవర్నర్ ధన్‌కర్ రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ల గురించి చ‌ర్చ సాగుతోంది. గ‌వ‌ర్న‌ర ఏమ‌ని ట్వీట్ చేశారంటే.. ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రభుత్వంలోని పబ్లిక్ సర్వెంట్లు, వారి సహచరులు, దళారీలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, భారీగా సంపదను పోగేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

దారుణంగా వృద్ధి చెందుతున్న అవినీతి పరిశ్రమను దెబ్బతీయడంలో వ్యవస్థాగత వైఫల్యం బహిరంగ రహస్యమని చెప్పారు. దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారన్నారు. ఇది పరిపాలనకు కళంకమని తెలిపారు. కోల్‌కతా పోలీసులు, పశ్చిమ బెంగాల్ పోలీసులు, వారి సహచరుల అక్రమ సంపదను దేశంలో, విదేశాల్లో పోగేసుకోవడంపైనా, అవినీతి కుంభకోణాలపైనా దర్యాప్తు జరగాలన్నారు. ఈ అవినీతిపరులకు అసాధారణ పర్యవసానాలు కలిగే విధంగా చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వృద్ధి చెందుతున్న అవినీతి గుట్టల గుట్టును రట్టు చేయాలన్నారు. ప్రజాస్వామ్యం కొనసాగడానికి అవినీతి గుట్టును బయటపెట్టాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here