ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సుల నిర్వ‌హ‌ణ‌కు వ‌చ్చిన ఇబ్బంది ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య క‌రోనా లాక్ డౌన్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బ‌స్సుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. అయితే ప‌లు ద‌ఫాలుగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా స‌ఫ‌లం కావ‌డం లేదు. ఫ‌లితంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఎప్ప‌టినుంచి బ‌స్సులు తిరుగుతాయో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి ఏర్ప‌డింది.

లాక్‌డౌన్ ప్రారంభం అంటే మార్చి నుంచి ఆర్టీసీ బ‌స్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డిన త‌ర్వాత సొంత రాష్ట్రాల్లో ఆర్టీసీ బ‌స్సులు న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. మొద‌ట్లో బ‌స్సుల్లో బౌతిక‌దూర పాటిస్తూ కూర్చునేవారు. ఇప్పుడు అన్ని సీట్ల‌లో కూర్చుంటున్నారు. అయితే ఇది కేవ‌లం ఆయా రాష్ట్రాల ప‌రిధిలో మాత్ర‌మే. అంత‌రాష్ట్ర స‌ర్వీసులు మాత్రం న‌డ‌వ‌డం లేదు.

ఇప్ప‌టికే మూడు సార్లు ఇరు రాష్ట్రాల అధికారులు స‌మావేశ‌మై బ‌స్సుల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించారు. అయినా స‌మ‌స్య‌లు కొలిక్కిరావ‌డం లేదు. ప్ర‌ధానంగా రోజుకు ఇన్ని కిలోమీట‌ర్లు మాత్ర‌మే న‌డ‌పాల‌న్న నిర్ణ‌యానికి ఇరు రాష్ట్రాల అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. రోజుకు 1.61 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల మేర బ‌స్సు స‌ర్వీసులు న‌డిపేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలంగాణ చెబుతోంది. అయితే ఏపీ మాత్రం 2.08 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల మేర న‌డుపుతామ‌ని ప్ర‌తిపాదించింది.

అయితే దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు ఉన్న‌తాధికారుల‌తో మ‌రోసారి చ‌ర్చించి భేటీ అవుదామ‌ని నిర్ణ‌యించారు. అయితే ఈ సారి మాత్రం ప‌రిస్థితులు ఓ కొలిక్కి వ‌చ్చేలానే క‌నిపిస్తున్నాయి. మ‌రో రెండు రోజుల్లో దీనిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అధికార వ‌ర్గాలు ద్వారా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌ర్వీసులు న‌డ‌వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇప్ప‌టికే ఆర్టీసీ న‌ష్ట‌పోతోంది. కాగా ప్రైవేటు ట్రావెల్స్ యాజ‌మాన్యాలు అన్ని ప‌ర్మిష‌న్లు తీసుకొని బ‌స్సులు న‌డుపుతున్న విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here